ది కేరళ స్టోరీ-2 ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 23న ఢిల్లీలో ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు, వాస్తవంగా ఇటువంటి ఘటనలకు గురై, ప్రాణాలతో బయటపడిన కొందరు మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అక్కడ తారా సహదేవ్ అనే మాజీ నేషనల్ షూటర్ తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సినిమాను ‘ప్రొపగండా’ అని విమర్శించే వారు మా నిజ జీవిత గాథలను వినాలని ఆమె కోరారు.
తారా సహదేవ్ వాస్తవ గాథ
“ఇక్కడికి రావడానికి ముందు నేను ‘ది కేరళ స్టోరీ-2’ రివ్యూలు చూశాను. కొందరు ప్రముఖులు ఇది కేవలం వదంతు అని, కావాలనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించడం చూశాను. నా కేసు 2014 నాటిది. ప్రజలకు మా అనుభవాలు ఒక కథలా అనిపించవచ్చు, కానీ ఇవి ఒక మనిషి అనుభవించిన నరకయాతన. మేమంతా ఇక్కడ మీ ముందు సజీవంగా కూర్చున్నాం అంటే అది మా అదృష్టం. 2014లో నేను నేషనల్ షూటర్‌గా నా కెరీర్ శిఖరాగ్రంలో ఉన్నాను. ఆ సమయంలో షూటింగ్ రేంజ్‌లోనే నాకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ఒక పెద్ద ఆఫీసర్ హోదాలో అక్కడికి వచ్చేవాడు.”
జడ్జి తీసుకొచ్చిన సంబంధం
“నా పెళ్లి సంబంధాన్ని ఒక జడ్జి తీసుకువచ్చారు. ఆయనే ఆ వ్యక్తిని మా ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేశారు. ఆ సమయంలో మా అమ్మ మరణించి కొద్ది రోజులే అయింది. నేను మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాను, మా నాన్నగారి ఆరోగ్యం కూడా బాగోలేదు. అవతలి వ్యక్తులు మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో గమనిస్తూ ఉంటారు. నేను మానసిక వేదనలో ఉన్నానని గ్రహించి, ఆ జడ్జి నాన్నగారి ముందే ‘అబ్బాయికి కేవలం తల్లి మాత్రమే ఉంది, ఆమె నిన్ను కూతురిలా చూసుకుంటుంది’ అని నమ్మబలికారు. నాకు షూటింగ్ కొనసాగించాలని, పైచదువులు చదవాలని ఉండేది.”
అంతా సవ్యంగా ఉందనుకున్నా.. కానీ పెళ్లి తర్వాతే అసలు రూపం
“అందరూ నన్ను అడుగుతున్నారు.. ‘మీరు విచారణ చేయలేదా?’ అని. నా తండ్రి, అన్నయ్య అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశారు. అతని ఆఫీస్, పని చేసే చోటు, అతని హిందూ గుర్తింపు.. అన్నీ సరిగ్గా ఉన్నాయని తేలింది. అతని సంరక్షకుడిగా ఒక జడ్జి ఉన్నప్పుడు, మేము గుర్తించలేకపోయాము అనడం తప్పు అవుతుంది. పెళ్లయిన కొన్ని నెలల తర్వాతే అతనికి రెండు గుర్తింపులు (డబుల్ ఐడెంటిటీ) ఉన్నాయని నాకు తెలిసింది.”
అత్తవారింట్లో మొదటి రోజే భయానక దృశ్యం
“పెళ్లికి ముందు నిశ్చితార్థం కోసం వారి ఇంటికి వెళ్ళాము. వాళ్ళ అమ్మకు సర్జరీ అయిందని చెప్పారు. అక్కడ అంతా హిందూ సాంప్రదాయం ప్రకారమే ఉంది. దేవతా మూర్తుల ఫోటోలు, ఓం, స్వస్తిక్ గుర్తులు అన్నీ ఉన్నాయి. జూలై 7, 2014న నా పెళ్లి జరిగింది. పెళ్లయిన మొదటి రోజు ఉదయం నేను గదిలో నుంచి బయటకు రాగానే ఆ ఇల్లు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అక్కడ మక్కా-మదీనా ఫోటోలు, అల్లా చిహ్నాలు కనిపించాయి. నేను కంగారుపడి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ‘ఇదేంటి?’ అని అడిగితే, ఆమె నన్ను బలంగా తోసేసి… ‘ఇదే మా అసలు రూపం, నువ్వు ఇక్కడే ఉండాలి’ అని గట్టిగా చెప్పింది. ఆ క్షణం నాకిప్పటికీ గుర్తుంది.”
