చిత్ర పరిశ్రమలో ఎందరో సంగీత దర్శకులు వచ్చినా, ఇళయరాజా స్థానం ప్రత్యేకం. పల్లెటూరి మట్టి వాసనతో కూడిన జానపదాల నుండి పాశ్చాత్య సంగీతం వరకు అన్ని రకాల బాణీలతో ఆయన మూడు తరాల అభిమానులను అలరిస్తున్నారు. బాధైనా, సంతోషమైనా ఇళయరాజా సంగీతం వినని వారు ఉండరు.
ఇళయరాజా తన వేల పాటల్లో అత్యధికంగా ఎస్. జానకి గారిచే పాడించారు. జానకి గారి గొంతు ఇళయరాజా బాణీలకు ప్రాణం పోసినట్లు ఉండేది. అందుకే ఆమెను తన ‘ఆస్థాన గాయని’గా మార్చుకున్నారు. అయితే, ఇళయరాజా కంపోజ్ చేసిన ఒక పాటను పాడుతూ జానకి గారు కన్నీరు పెట్టుకున్న ఘటన గురించి ఆమె స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
సాధారణంగా జానకి గారు స్టేజీ మీద లేదా రికార్డింగ్ థియేటర్లో పాడుతున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యేవారు కాదు. కనీసం శరీరం కూడా కదలకుండా ఒకే చోట నిలబడి పాడేవారు. కానీ, 1978లో వచ్చిన ‘అచ్చాణి’ చిత్రంలోని ‘మాతా ఉన్ కోవిలిల్..’ అనే పాట ఆమెను కలచివేసింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా, వాలి సాహిత్యం సమకూర్చారు.
రికార్డింగ్‌లో ఏం జరిగింది? ఈ పాటను కేవలం 3 గంటల్లోనే సిద్ధం చేశారని ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. స్టూడియోలో రికార్డింగ్ మొదలైనప్పుడు వాలి గారు రాసిన సాహిత్యం, రాజా గారి సంగీతం జానకి గారిని తీవ్రమైన ఉద్వేగానికి గురిచేశాయి. పాట పాడుతుండగానే ఆమె ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు.
జానకి గారిని కదిలించిన ఆ పంక్తులు: యేసు ప్రభువుకు జన్మనివ్వకపోయినా తల్లిగా మారిన మేరీ మాతను ఉద్దేశించి రాసిన “పిళ్ళై పెరాద పెణ్మై తాయానదు, అన్నై ఇల్లాద మగనై తాలాట్టుదు..” (బిడ్డను కనని ఓ స్త్రీ తల్లి అయ్యింది, తల్లి లేని కొడుకును జోలపాడి నిద్రపుచ్చుతోంది) అనే పంక్తులు వినగానే జానకి గారు ఆగిపోయారు. ఆమె ఏడుపు చూసి స్టూడియోలో ఉన్నవారంతా కంగారుపడ్డారు. “ఈ పదాలు పాడుతుంటే నాలో ఏదో తెలియని బాధ కలుగుతోంది, నేను పాడలేకపోతున్నాను” అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇళయరాజా ఆమెను ఓదార్చి, కొన్ని గంటల పాటు విరామం ఇచ్చి, ఆ తర్వాత రికార్డింగ్‌ను పూర్తి చేశారు.
