బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లాలో, ఛత్ పూజ కోసం తయారు చేసిన ప్రసాదాన్ని బాలిక ఎంగిలి చేసిందనే కోపంతో, ఒక తల్లి తన 4 ఏళ్ల కుమార్తెను దారుణంగా కొట్టి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు ఆ కర్కశ తల్లిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమస్తిపూర్ జిల్లా పూసా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మద్‌పూర్ భ్రౌలీ గ్రామానికి చెందిన రాజు పాశ్వాన్ భార్య రీనా కుమారి, ఛత్ పూజ కోసం ప్రసాదాలు తయారు చేస్తోంది. ఆ సమయంలో ఆమె 4 ఏళ్ల కుమార్తె సుహాని కుమారి ప్రసాదం తినాలని మారం చేయగా, తల్లి అడ్డుకుంది. అయినా సరే, ఆ పసిబాలిక తెలియక ప్రసాదాన్ని తాకి ఎంగిలి చేసినట్లు సమాచారం.
దీంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన రీనా కుమారి తన కూతురిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి అల్లాడిపోతున్న చిన్నారి సుహానిని చూసి భయపడిన తల్లి, వెంటనే ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది.
ఈ ఘటన జరిగిన సమయంలో కుటుంబంలోని ఇతర సభ్యులు ఛత్ పూజ కోసం ఘాట్ (తీరం) వద్ద ఏర్పాట్లు చేయడానికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు. ఈ విషాద వార్త గురించి తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పూసా పోలీస్ స్టేషన్ పోలీసులు, తల్లిని అరెస్టు చేయడంతో పాటు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం సమస్తిపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు.
తన కూతురిని కోల్పోయిన తండ్రి రాజు పాశ్వాన్, ఈ ఘాతుకానికి పాల్పడిన తన భార్యకు కఠిన శిక్ష పడేలా చేస్తానని కన్నీరుమున్నీరుగా తెలిపాడు. ఈ ఘటన ఆ గ్రామస్తులందరినీ కంటతడి పెట్టించగా, పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.

Leave a Reply