“జాలి, దయ లేని జన్మ..!” పూజ ప్రసాదాన్ని తాకిందన్న ఒకే ఒక్క కారణంతో పసిబిడ్డను చంపిన తల్లి.. ఈమె అసలు తల్లేనా..? రక్తం గడ్డకట్టించే దిగ్భ్రాంతికర ఘటన..!!

బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ (Samastipur) జిల్లాలో, ఛత్ పూజ (Chhath Puja) కోసం తయారుచేసిన ప్రసాదాన్ని చిన్నారి ఎంగిలి చేసిందన్న కారణంతో కోపోద్రిక్తురాలైన ఒక తల్లి, తన 4 ఏళ్ల కూతురిని దారుణంగా కొట్టి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు ఆ తల్లిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

సమస్తిపూర్ జిల్లా పూసా (Pusa) పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్‌పూర్ భ్రౌలీ గ్రామానికి చెందిన రాజు పాశ్వాన్ భార్య రీనా కుమారి, ఛత్ పూజ కోసం ప్రసాదాలు తయారు చేస్తోంది. ఆ సమయంలో ఆమె 4 ఏళ్ల కూతురు సుహానీ కుమారి ప్రసాదం కావాలని మారం చేయగా, తల్లి వారించింది. అయినాసరే, ఆ చిన్నారి తెలియక ప్రసాదాన్ని తాకి ఎంగిలి చేసిందని చెబుతున్నారు.

దీంతో తీవ్ర కోపానికి గురైన రీనా కుమారి, తన కూతురిని విచక్షణారహితంగా కొట్టింది. తీవ్ర గాయాలపాలై విలవిలలాడుతున్న చిన్నారి సుహానీని చూసి భయపడిన తల్లి, వెంటనే ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆ పసిప్రాణం అనంతలోకాలకు వెళ్లిపోయింది.

ఘటన జరిగిన సమయంలో కుటుంబంలోని ఇతర సభ్యులు ఛత్ పూజ కోసం ఘాట్ (గట్టు) ఏర్పాటు చేయడానికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు. ఈ విషాద వార్త తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పూసా పోలీస్ స్టేషన్ పోలీసులు, తల్లిని అరెస్టు చేయడంతో పాటు, చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమస్తిపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు.

తన కూతురిని కోల్పోయిన తండ్రి రాజు పాశ్వాన్, దారుణానికి ఒడిగట్టిన తన భార్యకు కఠిన శిక్ష పడేలా చేస్తానని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ ఘటన ఆ గ్రామస్తులందరినీ కన్నీట ముంచగా, పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *