“జిమ్‌లలో కొనసాగుతున్న మరణాలు..!”: నిన్నటిదాకా బాగానే ఉన్నారే.. వ్యాయామం చేస్తూ కనురెప్పపాటులో కుప్పకూలి డాక్టర్ మృతి..

అసోం రాష్ట్రంలోని నాగావ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న డాక్టర్ సాహిన్ రెహమాన్.. జిమ్‌లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఆగస్టు 27 రాత్రి సుమారు 7:36 గంటల ప్రాంతంలో ఆయన ఎప్పటిలాగే వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం. అక్కడున్న వారు తక్షణమే ప్రాథమిక వైద్య సహాయం అందించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దృశ్యాలు జిమ్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి.

డాక్టర్ సాహిన్ రెహమాన్ వర్కౌట్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషాదం ఆయన తోటి వైద్యులు, విద్యార్థులు, స్థానిక ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. వ్యాయామం వల్ల వచ్చిన గుండెపోటు (హార్ట్ ఎటాక్) వల్లే మరణించారనే దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేనందున, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు.

తీవ్రమైన వ్యాయామాలు చేసే సమయంలో లేదా ఆ తర్వాత కొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలతిరగడం, అకస్మాత్తుగా తీవ్ర నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వర్కౌట్ ఆపివేసి వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సాధారణ వ్యాయామం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. సుదీర్ఘ విరామం తర్వాత ఒక్కసారిగా హెవీ వర్కౌట్లు చేయడం, శరీర సామర్థ్యానికి మించి శ్రమించడం మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకే తీవ్రమైన వ్యాయామాలు ప్రారంభించడం సురక్షితం.

డాక్టర్ సాహిన్ రెహమాన్ హఠాన్మరణానికి గల కారణాలపై స్పష్టమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేవలం వర్కౌట్ వల్లే ఈ సమస్య తలెత్తిందా అనే దానిపై ప్రస్తుతానికి కచ్చితమైన నిర్ధారణ లేదు. ఈ ఘటనపై మరింత సమగ్ర సమాచారం వెల్లడికావాల్సి ఉంది. ఏది ఏమైనా, జిమ్ లేదా వర్కౌట్లు చేసే ప్రతి ఒక్కరూ తమ శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ విషాద ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *