ఆంధ్రప్రదేశ్ కోడి పందేలు: తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి అంటేనే ఒక ప్రత్యేకమైన సందడి. తెలంగాణలో గాలిపటాలు, విభిన్న పోటీలు ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం సంక్రాంతి అంటేనే కోడి పందేలకు పెట్టింది పేరు. పండుగకు మరో కొన్ని రోజులే సమయం ఉండటంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
గోదావరి జిల్లాల్లో జరిగే ఈ కోడి పందేలను చూడటానికి ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల నుండి కూడా జనం తరలివస్తారు. ఇక్కడ కేవలం పందేలే కాదు, వందల కోట్ల రూపాయల బెట్టింగ్లు కూడా జరుగుతాయి. ఈసారి కూడా భారీ స్థాయిలో పందేలు కాసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
పందెం కోళ్లకు రాజభోగం:
పోటీలకు ముందు కోళ్లను సిద్ధం చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. విఐపి అతిథుల కోసం ఏర్పాట్లు, పందెం రాయుళ్లను ఆకర్షించేలా కొత్త కొత్త బహుమతులపై నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
- ఆహారం: పందెం పుంజులను బలంగా తయారు చేయడానికి వాటికి బాదం, జీడిపప్పు, కోడిగుడ్లు, మాంసం మరియు ఖరీదైన పోషకాహారాన్ని అందిస్తున్నారు.
- శిక్షణ: ఉదయం, సాయంత్రం వేళల్లో వీటికి ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తున్నారు. రోగాల బారిన పడకుండా ఉండటానికి నీటి ట్యాంకుల్లో ఈత కొట్టించడం వంటి శిక్షణ ఇస్తున్నారు.
- ధరలు: పందెం కోళ్లకు గిరాకీ పెరగడంతో మార్కెట్లో ఒక్కో పుంజు ధర ₹50 వేల నుండి ₹2 లక్షల వరకు పలుకుతోంది.
