జీవితంలో రకరకాల కష్టాలు, ఓటములు ఎదురైనప్పుడు, క్లిష్ట పరిస్థితులను తట్టుకోలేనప్పుడు.. “దేవుడు తలచుకుంటేనే మనల్ని కాపాడగలడు” అని భావిస్తాం. దేవుడు మన జీవితంలో ఏదైనా అద్భుతం చేసి, మనల్ని ఈ కష్టాల నుండి గట్టెక్కించి ఆశీర్వదించాలని కోరుకుంటాం. అందుకే మనసు అలసిపోయినప్పుడు మనం దేవాలయాలకు వెళ్తాము. అలా మనం ఒక దేవాలయానికి వెళ్తే మన తలరాతే మారిపోతుందని అంటే మీరు నమ్ముతారా?
అటువంటి అద్భుతమైన ఆలయమే మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వర్ దేవాలయం. శివుని 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో పరమశివుడు మూడు ముఖాలతో దర్శనమిస్తాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (ముగ్గురు దేవుళ్లు) ఒకే లింగంలో ఉన్నట్లుగా ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. ఇది విశ్వ శక్తుల ఏకీకృత రూపంగా పరిగణించబడుతుంది. సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులు ఇక్కడ కొలువై ఉండటం వల్ల.. ఇక్కడకు వచ్చి దర్శించుకుంటే మన తలరాత ఎంత అధ్వాన్నంగా ఉన్నా అది మారిపోతుందని నమ్ముతారు.
ఈ ఆలయ ప్రాంగణంలో కుశవర్త కుండం అనే తీర్థం ఉంది. ఇది గోదావరి నది నుండి ఉద్భవించినట్లు చెబుతారు, అందుకే దీనిని ‘దక్షిణ గంగ’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కాలసర్ప దోష పూజ చేసుకుంటే నవగ్రహాల వల్ల కలిగే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి. ఈ ఆలయంలో జరిగే మరో ప్రసిద్ధ పూజ ‘నారాయణ్ నాగబలి’ పూజ. అకాల మరణం చెందిన కుటుంబ సభ్యుల ఆత్మల వల్ల కలిగే పితృ దోషాల నుండి విముక్తి పొందడానికి ఈ పూజ చేస్తారు.
ఇక్కడి గర్భాలయంలోని మూలవిరాట్ (లింగం) ఎప్పుడూ నీటి అడుగునే ఉంటుంది. గర్భాలయంలో నీరు నిరంతరం ఊరుతూనే ఉంటుంది. ఈ నీటి ఊట త్రిమూర్తుల అపారమైన శక్తికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని, జన్మ-మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
