ప్రకృతిలో కొన్ని జీవులు ఎంత వింతగా ఉంటాయంటే, వాటి గురించి విన్నప్పుడు మన కళ్లను మనమే నమ్మలేం. ఒక తల్లి తన జీవితంలో అస్సలు విశ్రాంతి తీసుకోకుండా, కేవలం పిల్లల్ని కంటూనే ఉంటుందని చెబితే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం. మనం మాట్లాడుకుంటున్నది ‘రాణి చెదపురుగు’ (Queen Termite) గురించి. ప్రపంచంలోనే అత్యంత విస్మయానికి గురిచేసే తల్లులలో ఇది ఒకటి.
రాణి చెదపురుగు సుమారు 25 నుండి 50 సంవత్సరాల వరకు జీవించగలదు. విశేషమేమిటంటే, ఈ సుదీర్ఘ కాలమంతా అది నిరంతరం గర్భవతిగానే ఉంటుంది. ఒక రాణి చెదపురుగు ప్రతి మూడు సెకన్లకు ఒక గుడ్డు పెడుతుంది. అంటే రోజుకు సుమారు 30,000 గుడ్లు పెడుతుందన్నమాట. ఈ లెక్కన తన జీవితకాలంలో కోట్లాది పిల్లలకు జన్మనిస్తుంది. గుడ్లతో నిండి ఉండటం వల్ల దాని పొట్ట ఎంత భారీగా మారుతుందంటే, అది సొంతంగా కదలలేక ఒకే చోట ఉండిపోతుంది. కూలీ చెదపురుగులు దానికి ఆహారం అందించడం, శుభ్రం చేయడం మరియు ఆ గుడ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి పనులు చేస్తాయి.
ఒంటరిగా సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది:
శాస్త్రవేత్తల ప్రకారం, ఒక చెదపురుగుల కాలనీ సక్సెస్ అంతా ఈ రాణిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలో చిన్నదిగా ఉన్న కాలనీ, రాణి నిరంతరం గుడ్లు పెట్టడం వల్ల లక్షలాది సంఖ్యకు చేరుకుంటుంది. ఈ చెదపురుగులు కాలనీని నిర్మించడం, ఆహారాన్ని సేకరించడం, రక్షణ కల్పించడం మరియు రాణిని చూసుకోవడం వంటి పనులు చేస్తాయి. రాణి చెదపురుగు శరీరం మిగిలిన పురుగుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీని పొట్ట పొడవుగా, ఉబ్బిపోయి ఉంటుంది. కొన్ని జాతులలో రాణి బరువు ఎంతగా పెరుగుతుందంటే అది అస్సలు కదలలేదు. తన జీవితాంతం రాజు చెదపురుగుతో కలిసి ఉంటూ సంతానోత్పత్తి చేస్తూనే ఉంటుంది. సాధారణంగా కీటకాలు కొన్ని వారాలు లేదా నెలలు మాత్రమే జీవిస్తాయి, కానీ రాణి చెదపురుగు దశాబ్దాల పాటు జీవించడం విశేషం.
అత్యంత క్రమశిక్షణతో కూడిన జీవనం:
ఆఫ్రికన్ చెదపురుగులలోని కొన్ని జాతులు 50 ఏళ్ల వరకు గుడ్లు పెడుతూనే ఉంటాయి. అంటే అవి తమ జీవితాంతం గర్భవతిగానే ఉంటాయని అర్థం. చెదపురుగుల కాలనీలో ప్రతి సభ్యునికి ఒక ప్రత్యేక బాధ్యత ఉంటుంది. రాణి కేవలం గుడ్లు పెడితే, రాజు ఆమెతోనే ఉంటాడు. కూలీ చెదపురుగులు నిర్మాణం మరియు ఆహార సేకరణ చూసుకుంటే, సైనిక చెదపురుగులు కాలనీకి రక్షణ కల్పిస్తాయి.
భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా చెదపురుగులను కేవలం కలపను నాశనం చేసే పురుగులుగా భావిస్తారు. కానీ జీవశాస్త్ర పరంగా ఇవి ప్రకృతిలో ఒక అద్భుతం. ఒక్క రాణి నుండి మొదలైన ప్రయాణం లక్షల సంఖ్యకు ఎలా చేరుకుంటుందో చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం రాణి చెదపురుగుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply