ఝాన్సీ: పెళ్లి సమయంలో జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన భర్త, డబ్బు చేతికి అందగానే బాధ్యతలను మర్చిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఒక వివాహిత భర్త, తన వాటాగా వచ్చిన భారీ పరిహారం తీసుకుని భార్యాపిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు.
ఏం జరిగింది?
ఝాన్సీలోని ఇమిలియా గ్రామానికి చెందిన నీలేష్ అనే వ్యక్తికి, రుచి పరిహార్తో వివాహమైంది. వీరికి 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. నీలేష్ తండ్రికి చెందిన 5 ఎకరాల భూమిని బుందేల్ఖండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ (BIDA) ప్రాజెక్ట్ కోసం తీసుకుంది. దీనికి ప్రతిగా ప్రభుత్వం సుమారు కోటి రూపాయల పరిహారాన్ని చెల్లించింది. ఆ మొత్తాన్ని తండ్రి తన ముగ్గురు కుమారులకు సమానంగా పంచగా, నీలేష్ వాటాకు రూ. 25 లక్షలు వచ్చాయి.
డబ్బుతో మారిన బుద్ధి..
రూ. 25 లక్షల భారీ మొత్తం చేతికి అందగానే నీలేష్ ప్రవర్తనలో అనూహ్య మార్పులు వచ్చాయి. అదే గ్రామానికి చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న నీలేష్, భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. చివరకు వారిని వదిలేసి ఆ మహిళతో కలిసి పారిపోయాడు. ఎటువంటి ఆదాయ వనరులు లేని రుచి పరిహార్, తన 6 ఏళ్ల కుమారుడి భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతూ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసుల చర్య..
తన భర్తను వెతికి పెట్టాలని, తన కుమారుడికి రావాల్సిన హక్కులను కాపాడాలని రుచి పరిహార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నీలేష్ మరియు ఆ మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
