ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జూదానికి బానిసైన ఓ యువకుడు, చివరకు దొంగల ముఠాకు నాయకుడిగా మారిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మంగళగిరికి చెందిన వెన్న దుర్గా దినేష్ అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో పలు లక్షల రూపాయలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. అప్పులు తీర్చలేక వివిధ మార్గాల్లో డబ్బులు సమీకరించేందుకు అతను ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
జూదంలో పోగొట్టుకున్న డబ్బును పూడ్చుకునేందుకు మొదట అప్పులు చేశాడని పోలీసులు తెలిపారు. అప్పులు తిరిగి చెల్లించలేక, ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మేశాడు. అయినా కూడా డబ్బు సరిపోకపోవడంతో, తన కిడ్నీలలో ఒకదాన్ని అమ్మేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. దీంతో అతనికి ‘సింగిల్ కిడ్నీ సాయి’ అనే పేరు కూడా వచ్చిందని సమాచారం.
కిడ్నీ అమ్మిన తర్వాత కూడా అప్పులు పూర్తిగా తీర్చలేకపోవడంతో, అతను దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించాడని పోలీసులు చెప్పారు. గుంటూరు జిల్లాలోనే అతనిపై 12 దొంగతనం కేసులు నమోదయ్యాయని, పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడని తెలిపారు. జైలులో ఉన్నప్పుడు మరో నేరస్తుడితో అతనికి పరిచయం ఏర్పడిందని, బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు.
ఇటీవల గణపవరం ప్రాంతంలో రెండు ఇళ్లలో, చిలకలూరిపేట ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన దొంగతనాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో కొందరిని అరెస్టు చేయగా, దుర్గా దినేష్‌తో పాటు అతని మరో అనుచరుడు కూడా పట్టుబడినట్లు సమాచారం. ఈ ముఠాలో దుర్గా దినేష్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. జూదంతో మొదలైన అప్పుల పర్వం, చివరకు అతన్ని దొంగల ముఠాకు నాయకుడిని చేసి జైలుపాలు చేసిందని పోలీసుల విచారణలో తేలింది.

Leave a Reply