మహారాష్ట్రలోని డోంబివ్లీలో భూ యాజమాన్య హక్కులకు సంబంధించి దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ భూమికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఇప్పటికే విభేదాలు కొనసాగుతుండగా, అక్కడ నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నిర్మాణ సంస్థకు చెందిన కొందరు బౌన్సర్లు/సెక్యూరిటీ గార్డులతో కలిసి వచ్చి, జేసీబీ యంత్రాలతో ఇళ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు స్థానికులు జేసీబీ ముందు గుమిగూడారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి చివరికి పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారని స్థానిక వర్గాలు తెలిపాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.
ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కొందరు జేసీబీ యంత్రానికి ఎదురుగా నిలబడి అడ్డుకోవడం, మరికొందరు యంత్రంపైకి ఎక్కి నిరసన తెలపడం ఆ వీడియోల్లో కనిపించింది. మరో వీడియోలో ఓ మహిళ జేసీబీ చర్యలను ధైర్యంగా అడ్డుకోవడం రికార్డయింది. భూమి పత్రాలు, యాజమాన్య హక్కుల విషయంలోనే ఈ వివాదం తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు స్థానికులు చేసిన ఆరోపణలను నిర్మాణ సంస్థకు చెందిన రామేశ్వర్ గుప్తా ఖండించారు. సదరు భూమిని చట్టబద్ధమైన ప్రక్రియ ప్రకారమే కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. స్థలాన్ని పరిశీలించినప్పుడు అక్కడ దాదాపు 60 గదులు ఉన్నాయని, వాటి విక్రయానికి సంబంధించి వేరే వివాదం నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మాన్పాడా పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదులు, భూమి పత్రాలు, వైరల్ వీడియోలు మరియు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ భూ వివాదం తాలూకు పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Leave a Reply