ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్‌లో ఉన్న సిబినాంగ్ (Cibinong) జైలులో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సాధారణ జైలు గదుల్లా కాకుండా.. కొందరు ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలాసవంతమైన సదుపాయాలను గుర్తించినట్లు సమాచారం.
ఇండోనేషియా అంబుడ్స్‌మన్ (Ombudsman) బృందం ఈ తనిఖీలను నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ తనిఖీల్లో 10కి పైగా భవన ప్రాంగణాల్లో ఏసీ, పెద్ద టీవీ, వంటగది సదుపాయాలు, రిఫ్రిజిరేటర్లు (ఫ్రిజ్‌లు) తదితర సౌకర్యాలు ఉన్నట్లు తెలిసింది. కొన్ని గదుల్లో వ్యాయామ పరికరాలు ఉండటంతో పాటు, సాధారణ జైలు గదులకు పూర్తి భిన్నమైన ఇంటీరియర్ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, కొన్ని ఫ్రిజ్‌లలో మద్యం సీసాలు కూడా లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.
దీంతో జైలు భద్రతపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా, ఆ విలాసవంతమైన గదుల వెనుక భాగంలో ఎలాంటి నిఘా లేని బయటకు వెళ్లే రహస్య మార్గాలు ఉన్నాయని, అవి సమీపంలోని వెదురు అడవి, చెత్త డంపింగ్ యార్డుకు చేరుకునేలా ఉన్నాయని విచారణలో తేలింది. దీనివల్ల ఖైదీలు సులభంగా తప్పించుకునే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, ఇండోనేషియా ఇమ్మిగ్రేషన్ మరియు కరెక్షనల్ మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. జైలులో అనుమతి లేకుండా ఇలాంటి సదుపాయాలు ఎలా ఏర్పాటు చేశారు, ఖైదీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారా అనే కోణంలో వివిధ సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు జైలు అధికారులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు (సస్పెండ్ చేసినట్లు) సమాచారం.

Leave a Reply