జ్యోతిష్యంతో క్యాన్సర్‌ను నయం చేయవచ్చన్న టీవీకే అభ్యర్థి విజయం.. డీఎంకే నిలబెట్టిన 26 ఏళ్ల మహిళా డాక్టర్ ఓటమి!

కవుండంపాళయం: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జ్యోతిష్యం ద్వారా క్యాన్సర్‌ను నయం చేయవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీవీకే (TVK) అభ్యర్థి కనిమొళి సంతోష్ విజయం సాధించారు. మరోవైపు, అవినాశి నియోజకవర్గంలో డీఎంకే నిలబెట్టిన 26 ఏళ్ల యువ మహిళా వైద్యురాలు కోకిలమణి ఓటమి పాలుకావడం చర్చనీయాంశమైంది.

విజ్ఞానానికి, హేతువాదానికి ప్రాధాన్యత ఇచ్చే తమిళనాడులో ప్రజలు సైన్స్‌కు బదులు మూఢనమ్మకాలకు పట్టం కట్టారా అని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కవుండంపాళయం: కనిమొళి సంతోష్ విజయం
కోయంబత్తూరు జిల్లా కవుండంపాళయం నియోజకవర్గం నుండి తమిళగ వెట్రి కళగం (TVK) తరపున 37 ఏళ్ల కనిమొళి సంతోష్ పోటీ చేశారు. సుమారు రూ. 25.50 కోట్ల ఆస్తులున్న ఈమె, గతంలో ఒక వీడియోలో “జ్యోతిష్యం ద్వారా క్యాన్సర్ వ్యాధిని నయం చేయవచ్చు” అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. శాస్త్రీయత లేని ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తికి విజయ్ ఎలా అవకాశం ఇచ్చారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే, తాజా ఫలితాల్లో ఆమె ఏకంగా 42 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అవినాశి: వైద్యురాలు కోకిలమణి ఓటమి
మరోవైపు అవినాశి (రిజర్వ్డ్) నియోజకవర్గంలో డీఎంకే ఒక ఆదర్శవంతమైన అభ్యర్థిని నిలబెట్టింది. 26 ఏళ్ల కోకిలమణి వృత్తిరీత్యా వైద్యురాలు. అట్టడుగు వర్గాల (అరుంధతియర్ సామాజిక వర్గం) నుండి వచ్చి ఎంతో కష్టపడి డాక్టరుగా ఎదిగిన ఆమెకు డీఎంకే అవకాశం ఇచ్చింది. ఆమె తరపున మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ స్వయంగా ప్రచారం చేశారు.

అయితే, ఈ నియోజకవర్గంలో కోకిలమణి మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక్కడ టీవీకే అభ్యర్థి కమలి విజయం సాధించగా, రెండో స్థానంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నిలిచారు. కోకిలమణి కేవలం 1869 ఓట్ల స్వల్ప తేడాతో మూడో స్థానానికి పడిపోయి ఓటమిని చవిచూశారు.

నెటిజన్ల ఆవేదన
జ్యోతిష్యంతో వైద్యం చేస్తానన్న వ్యక్తి గెలిచి, నిజమైన వైద్యురాలు ఓడిపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే లెఫ్ట్ పాండి, గిల్లీ కుమార్, మరియా విల్సన్ వంటి వివాదాస్పద వ్యక్తులు కూడా విజయం సాధించడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: