“టికెట్ లేదా?” అంటూ తనిఖీకి వచ్చిన అధికారులు.. మరుక్షణమే కదిలే రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు! ఒక్క తనిఖీలోనే దొరికిపోయిన 371 మంది.. వైరల్ అవుతున్న వీడియో.!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ ప్రాంతంలో కదులుతున్న రైలులో అకస్మాత్తుగా చేపట్టిన టికెట్ తనిఖీ తీవ్ర కలకలం రేపింది.

రసౌలీ రైల్వే స్టేషన్‌లో అయోధ్య-లక్నో రైలులో తనిఖీలు నిర్వహిస్తుండగా, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న పలువురు రైల్వే అధికారులు, రైల్వే పోలీసులను చూడగానే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీరిలో కొందరు కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టికెట్ లేని కొందరు ప్రయాణికులు రైలు మరుగుదొడ్లలోకి (టాయిలెట్లలోకి) వెళ్లి దాక్కునే ప్రయత్నం చేయగా, మరికొందరు కదులుతున్న రైలు నుంచి ప్లాట్‌ఫామ్, రైలు పట్టాల వైపు దూకేశారు. తోటి ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. రైలు నుంచి దూకే క్రమంలో కొందరు కిందపడి దెబ్బలు తగిలించుకున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటన ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.

రసౌలీ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలో మొత్తం 371 మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం వారందరినీ లక్నోకు తరలించారు. ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో టికెట్ లేని ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు చెలరేగాయని, అందుకే కొందరు ప్రాణాలకు తెగించి ఇలాంటి ప్రమాదకర చర్యలకు ఒడిగట్టారని తెలిసింది.

టికెట్ రహిత ప్రయాణాలను అరికట్టేందుకు రైల్వే విభాగం ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. అయితే, జరిమానా లేదా చర్యలకు భయపడి కదులుతున్న రైలు నుంచి దూకడం అనేది ప్రయాణికుల ప్రాణాలకే పెను ముప్పు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపిస్తుండగా, రైలు ప్రయాణంలో నియమ నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *