లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ (Laureus World Sports Awards): క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవంగా లారియస్ అవార్డులను పరిగణిస్తారు. ఏ క్రీడాకారుడు లేదా జట్టు ఈ అవార్డు గెలుచుకున్నా, అది ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. అందుకే దీనిని ‘క్రీడల ఆస్కార్’ అని పిలుస్తారు. తాజాగా, భారత మహిళా క్రికెట్ జట్టు ఈ ప్రతిష్టాత్మకమైన ‘లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు షార్ట్‌లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI) స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ప్రముఖ జట్లతో పోటీలో భారత్:
భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు మరో ఐదు ప్రపంచ స్థాయి జట్లు కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నాయి:
- పారిస్ సెయింట్-జర్మైన్ (ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్)
- మెక్‌లారెన్ ఫార్ములా 1 టీమ్ (UK)
- యూరోపియన్ రైడర్ కప్ టీమ్ (గోల్ఫ్)
- ఇంగ్లాండ్ మహిళా ఫుట్‌బాల్ టీమ్ (UK)
- ఓక్లహోమా సిటీ థండర్ (USA బాస్కెట్‌బాల్ టీమ్)
విజేతను 70కి పైగా దేశాలకు చెందిన 1,000 మందికి పైగా స్పోర్ట్స్ మీడియా ప్రతినిధుల ఓట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ అవార్డు వేడుక ఏప్రిల్ 20, 2026న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరగనుంది.
బీసీసీఐ స్పందన:
బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ మాట్లాడుతూ, “ఈ నామినేషన్ భారత క్రికెట్‌కు గర్వకారణం. 2025లో మా అమ్మాయిలు చారిత్రక ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సాధించడం ద్వారా వారి సత్తా చాటారు” అని అన్నారు. అలాగే బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా కూడా టీమ్ ఇండియా విజయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిందని ప్రశంసించారు.

Leave a Reply