టీ-షర్టు ఊపుతూ సాయం కోరిన యువకుడు.. హెలికాప్టర్ ద్వారా కాపాడిన ఆర్మీ.. ప్రాణాలు కాపాడిన భావోద్వేగ వీడియో నెట్టింట వైరల్..!!

నేపాల్ దేశంలోని మధ్య ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లగా.. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ ద్వారా చేపట్టిన అత్యంత ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వరద నీరు చుట్టుముట్టిన ఒక భవనం పైకప్పు (టెర్రస్)పై ఓ యువకుడు చిక్కుకుపోయాడు. చుట్టూ ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు, కొట్టుకొస్తున్న వ్యర్థాల మధ్య నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ యువకుడు.. అటుగా వెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ను చూసి తన టీ-షర్టును గాల్లో ఊపుతూ కాపాడాలంటూ వేడుకున్నాడు.

వెంటనే స్పందించిన నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ సిబ్బంది.. ఆ భవనం పైకప్పు వద్దకు అత్యంత ప్రమాదకర రీతిలో హెలికాప్టర్‌ను తీసుకెళ్లారు. ఆర్మీ జవాను చాకచక్యంగా సాయం చేసి, ఆ యువకుడిని సురక్షితంగా హెలికాప్టర్‌లోకి ఎక్కించుకుని కాపాడారు.

భోటేకోశి నదిలో వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా రోడ్డు మార్గాలు పూర్తిగా కొట్టుకుపోవడంతో.. ఆర్మీ ఇలాంటి హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ల ద్వారా ఎన్నో నిండు ప్రాణాలను కాపాడుతోంది. ప్రాణాలకు తెగించి నేపాల్ సైన్యం చేపట్టిన ఈ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *