టీ20 వరల్డ్ కప్: భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్‌పై లీగల్ యాక్షన్! పీసీబీని హెచ్చరించిన ఐసీసీ

ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను బహిష్కరిస్తే, టోర్నమెంట్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ (ప్రసారకర్త) జియోస్టార్ నుండి చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)ని హెచ్చరించింది.

మంగళవారం పీసీబీ వర్గాలు ఈ సమాచారాన్ని వెల్లడించాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని పాక్ నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయానికి గల కారణాలను పీసీబీ ఇప్పటి వరకు ఐసీసీకి అధికారికంగా తెలియజేయలేదు.

పాకిస్థాన్‌కు భారీ ఆర్థిక నష్టం?

ఐసీసీ నుంచి పాకిస్థాన్‌కు అందే వార్షిక ఆదాయ వాటా (సుమారు 3.5 కోట్ల డాలర్లు) నిలిపివేసి, ఆ మొత్తాన్ని నష్టపరిహారం కింద బ్రాడ్‌కాస్టర్లకు చెల్లించే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు ఇప్పటికే సూచించాయి. పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చించినప్పటికీ, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి బోర్డు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
  • పరిహారం మరియు కేసులు: భారత్‌తో ఆడబోమని పాకిస్థాన్ మొండికేస్తే, ఆర్థిక జరిమానాలతో పాటు బ్రాడ్‌కాస్టర్ల నుండి కోర్టు కేసులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (DRC)లో కూడా పాకిస్థాన్‌కు అనుకూల ఫలితం వచ్చే అవకాశం లేదు.
  • తటస్థ వేదిక: పాకిస్థాన్ ఇప్పటికే భారత్‌లో కాకుండా తటస్థ వేదిక అయిన శ్రీలంకలో తన మ్యాచ్‌లను ఆడుతోంది. భారత ప్రభుత్వం తన టీమ్‌ను పాకిస్థాన్‌కు పంపకపోయినా, తటస్థ వేదికలపై పాక్‌తో ఆడటానికి ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచ్‌ను బహిష్కరించడం చెల్లదని నిపుణులు అంటున్నారు.
ఒప్పందాల ఉల్లంఘన

ఐసీసీ తన ఈవెంట్ల కోసం బ్రాడ్‌కాస్టర్లతో చేసుకున్న నాలుగేళ్ల ఒప్పందంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు ప్రధానమైనవి. దీని ఆధారంగానే బ్రాడ్‌కాస్టర్లు భారీ మొత్తాన్ని ఐసీసీకి చెల్లిస్తారు. “కాబట్టి, ఒప్పంద ఉల్లంఘన కింద పీసీబీ మరియు ఐసీసీని కోర్టుకు లాగే పూర్తి హక్కు బ్రాడ్‌కాస్టర్లకు ఉంటుంది” అని వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుండి తొలగించినందుకు నిరసనగా పాకిస్థాన్ ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


Posted

in

by

Tags: