రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని అమేర్లో టూరిస్ట్ గైడ్ మనీష్ సోనీ హత్యకు గురై నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో అక్కడ మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.
మనీష్ సోనీ హత్య తర్వాత నిలిపివేసిన టూరిస్ట్ జీపు సేవలను మళ్లీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు రోడ్డెక్కారు. జీపులను నడిపే ముందు భద్రతకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా ఉంది. దీంతో ఆ ప్రాంతంలో దుకాణాలు మూసివేసి నిరసన చేపట్టారు.
గత సెప్టెంబర్ నెలలో అమేర్ కోట సమీపంలో జరిగిన గొడవలో మనీష్ సోనీపై కత్తితో దాడి జరగగా తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 8వ తేదీన మృతి చెందాడు. ఈ కేసులో జీపు డ్రైవర్ ఆజంను పోలీసులు అరెస్టు చేశారు. మనీష్ హత్య తర్వాత అమేర్లో జీపు సేవలను నిలిపివేయడంతో, చాలా రోజులుగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నామని జీపు డ్రైవర్లు వాపోయారు. ఈ నేపథ్యంలోనే అధికారులు జీపు సేవలను మళ్లీ ప్రారంభించినట్లు సమాచారం.
జీపు సేవలు మళ్లీ ప్రారంభమైన విషయం తెలుసుకున్న స్థానికులు, మనీష్ కుటుంబ సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జీపు డ్రైవర్ల పేర్లను నమోదు చేయాలని, ప్రతి వాహనానికి నిర్దిష్ట డ్రైవర్ ఉండాలని, అతని పూర్తి వివరాలు రికార్డు చేయాలనే భద్రతా నిబంధనలు అమలు చేస్తామని గతంలో జరిగిన చర్చల్లో అధికారులు ఒప్పుకున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఆ నిబంధనలు పూర్తిగా అమలు కాలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో అమేర్ కోట వైపు వెళ్తున్న జీపులను అడ్డుకోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించినట్లు తెలుస్తోంది.
మరోవైపు, చాలా రోజులుగా జీపు సేవలు నిలిచిపోవడంతో తమ కుటుంబాల జీవనోపాధి దెబ్బతిన్నదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక సీజన్ మొదలైన నేపథ్యంలో జీపు సేవలు నిరంతరాయంగా కొనసాగాలని వారు కోరుతున్నారు. దీంతో అమేర్లో ఒకవైపు భద్రత, శాంతిభద్రతలకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతుండగా, మరోవైపు జీపు డ్రైవర్ల జీవనోపాధి సమస్య తెరపైకి వచ్చింది. ఇరువర్గాలతో పోలీసులు, అధికార యంత్రాంగం చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply