టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ వద్ద ఉన్న ఓ ప్రత్యేక యూజర్‌నేమ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే @liar అనే పేరు!
ఈ యూజర్‌నేమ్‌ను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు దురోవ్ వెల్లడించారు. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.8 నుంచి రూ.9 కోట్ల వరకు ఉంటుంది.
అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ‘Liar’ అంటే తెలుగులో ‘అబద్ధాలకోరు’ అని అర్థం.
అంత భారీ మొత్తం చెల్లించి, ‘అబద్ధాలకోరు’ అనే పేరును సొంతం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తిని ఎలా నమ్మాలి? అంటూ పావెల్ దురోవ్ సరదాగా వ్యాఖ్యానించారు.
నవంబర్ 24న సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించిన దురోవ్.. ఆ ఆఫర్ నిజమైనదై ఉండాలని కోరుకుంటున్నానని, అయితే తనను తాను అబద్ధాలకోరుగా పిలుచుకోవాలనుకునే వ్యక్తిని నమ్మడం కష్టమని చమత్కరించారు.
ఈ భారీ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? నిజంగానే అంత మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారా? అనే వివరాలను మాత్రం దురోవ్ వెల్లడించలేదు. అంతేకాదు, ఈ యూజర్‌నేమ్ అమ్మకం కూడా ఇంకా ఖరారైనట్లు సమాచారం లేదు.
టెలిగ్రామ్ యూజర్‌నేమ్‌లకు ఎందుకింత డిమాండ్?
టెలిగ్రామ్‌లో ఇలాంటి ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి ‘ఫ్రాగ్మెంట్’ (Fragment) అనే ప్రత్యేక మార్కెట్‌ప్లేస్ ఉంది.
ఈ యూజర్‌నేమ్‌లను TON బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారంగా డిజిటల్ ఆస్తులుగా నమోదు చేసి, ఇతరులకు బదిలీ చేయవచ్చు.
ముఖ్యంగా చిన్న పేర్లు, ఒకే పదంతో ఉండే పేర్లు, సులభంగా గుర్తుంచుకోగలిగే యూజర్‌నేమ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.
గతంలో కూడా టెలిగ్రామ్‌లోని @pride అనే యూజర్‌నేమ్‌కు 2.56 లక్షల అమెరికన్ డాలర్ల ఆఫర్ వచ్చినట్లు దురోవ్ వెల్లడించారు.
ఇప్పుడు @liar పేరుకు ఏకంగా 10 లక్షల డాలర్ల ఆఫర్ రావడం మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అయితే టెలిగ్రామ్‌లో ఉన్న ప్రతి యూజర్‌నేమ్‌కూ కోట్ల రూపాయల విలువ ఉంటుందని అనుకోవద్దు. పేరు ఎంత ప్రత్యేకంగా ఉంది? ఎంత చిన్నదిగా ఉంది? దానికి ఎంత డిమాండ్ ఉంది? కొనుగోలుదారులు ఎంత ఆసక్తి చూపిస్తున్నారు? అనే అంశాల ఆధారంగానే దాని ధర నిర్ణయించబడుతుంది.
ఒక్క యూజర్‌నేమ్‌కు ఇంత భారీ ధర పలకడం చూస్తుంటే.. డిజిటల్ ప్రపంచంలో పేర్లకు కూడా కోట్ల విలువ ఉంటుందని మరోసారి స్పష్టమవుతోంది!

Leave a Reply