హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న అమెరికా మరియు బ్రిటిష్ సంయుక్త సైనిక స్థావరం (డీగో గార్షియా)పై ఇరాన్ ఖండాంతర క్షిపణులతో (ICBM) దాడి చేసినట్లు వెలువడిన వార్త అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.
అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరుపుతున్న యుద్ధం మూడవ వారానికి చేరుకున్న తరుణంలో, ఈ దాడి ఒక కీలక మలుపుగా పరిగణించబడుతోంది. గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల మధ్య ఘర్షణ ముదురుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఈ యుద్ధం హిందూ మహాసముద్రం వరకు విస్తరించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్‌పై సైనిక చర్యలను ‘తగ్గించడం’ గురించి అమెరికా పరిశీలిస్తోందని తెలిపారు. యుద్ధ లక్ష్యాలను చేరుకోవడానికి అమెరికా సైన్యం చాలా దగ్గరగా ఉందని, త్వరలోనే శాంతి నెలకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, ట్రంప్ ఇలా శాంతి మాటలు మాట్లాడిన కొద్ది గంటల్లోనే, డీగో గార్షియా స్థావరంపై దాడి జరగడం ఆయన ప్రకటనకు విరుద్ధంగా ఉంది.
‘వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదిక ప్రకారం, డీగో గార్షియా సంయుక్త సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిని ధృవీకరించిన అమెరికా అధికారులు, ప్రయోగించిన రెండు క్షిపణులు లక్ష్యాన్ని తాకలేదని తెలిపారు. ఒక క్షిపణి ప్రయాణంలో ఉండగానే సాంకేతిక లోపం కారణంగా పనిచేయకుండా పోగా, మరొకటి అమెరికా క్షిపణి నిరోధక వ్యవస్థ ద్వారా గాలిలోనే ధ్వంసం చేయబడింది.
బ్రిటిష్ భూభాగంలో ఉన్న ఈ డీగో గార్షియా స్థావరం అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలు, అణు జలాంతర్గాములు మరియు క్షిపణి విధ్వంసక నౌకలకు ప్రధాన కేంద్రం. ఇరాన్ నుండి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడం సైనిక విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ గతంలో మాట్లాడుతూ తమ క్షిపణుల పరిధి 2,000 కి.మీ మాత్రమేనని చెప్పారు. కానీ ఇప్పుడు 4,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని తాకడం ద్వారా, ఇరాన్ క్షిపణి సాంకేతికత వారు చెప్పినదానికంటే రెట్టింపు సామర్థ్యం కలిగి ఉందని నిరూపితమైంది.
