అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలను పెంచుతూ ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
స్వయంప్రతిపత్తి కలిగిన సమాఖ్య సంస్థల (Federal Agencies) అధిపతులను, బోర్డు సభ్యులను అధ్యక్షుడు తన ఇష్టానుసారం తొలగించవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. అయితే, అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ‘ఫెడరల్ రిజర్వ్’ విషయంలో మాత్రం మినహాయింపునిచ్చింది.
అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ మాజీ సభ్యురాలు రెబెక్కా స్లాటర్, ఎటువంటి సరైన కారణం లేకుండానే తనను ట్రంప్ తొలగించారని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో, వాణిజ్య కమిషన్ వంటి స్వతంత్ర సంస్థల సభ్యులను తొలగించాలంటే బలమైన కారణం ఉండాలనే నిబంధన ఉండేది.
తొమ్మిది మంది సభ్యులున్న అమెరికా సుప్రీంకోర్టులో, ఆరుగురు సంప్రదాయవాద న్యాయమూర్తుల మెజారిటీతో ఈ తీర్పు వచ్చింది. దీనితో గత 91 ఏళ్లుగా అమలులో ఉన్న కీలక చట్టం మారింది. అమెరికా రాజ్యాంగంలోని అధికార విభజన సూత్రాలకు పాత నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వంటి అనేక సంస్థల అధిపతులను అధ్యక్షుడు సులభంగా తొలగించే అధికారం పొందారు.
ఈ తీర్పును ట్రంప్ స్వాగతించారు. “అధ్యక్షుడి అధికారాల విషయంలో వెలువడిన అత్యంత చారిత్రాత్మక తీర్పుల్లో ఇది ఒకటి. ఈ తీర్పు వచ్చిన సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిగా ఉండటం గర్వకారణం” అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే, ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్‌ను వెంటనే తొలగించాలని ట్రంప్ చేసిన ప్రయత్నాన్ని కోర్టు నిలిపివేసింది. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌ను ఎటువంటి కారణం లేకుండా తొలగిస్తే, ఆ సంస్థ యొక్క స్వతంత్రత దెబ్బతింటుందని కోర్టు పేర్కొంది. వడ్డీ రేట్ల నిర్ణయాల్లో ట్రంప్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చూస్తోందని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో, ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
