ట్రంప్ యుద్ధ విజయ ప్రకటనపై ఇరాన్ ఎటకారం; ‘లెగో’ ఏఐ మీమ్‌తో సోషల్ మీడియాలో సెటైర్లు!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, వైరల్ మీమ్స్ మరియు వ్యంగ్య పోస్టుల ద్వారా ఇరాన్ పదేపదే అమెరికాను ఎద్దేవా చేస్తోంది.

“ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా గెలిచింది” అని డొనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటిస్తున్న నేపథ్యంలో, ఘనాలోని ఇరాన్ రాయబార కార్యాలయం మంగళవారం ట్రంప్‌పై విమర్శలు గుప్పించింది. “తాను ఇరాన్‌ను ఓడించినట్లు ఆయన కలలు కంటున్నట్లున్నారు. ఆయన్ని నిద్రపోనివ్వండి, లేపకండి” అంటూ ఎక్స్ (X) వేదికగా సెటైర్లు వేసింది.

వైరల్ వీడియోలో ఏముంది? సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక లెగో తరహా ఏఐ వీడియోలో.. ట్రంప్ గాఢ నిద్రలో ఉండగా వైట్ హౌస్ అధికారులు ఆయన పక్కనే నిలబడి ఉంటారు. ఒక అధికారి “ఆయన్ని నిద్రలేపుదాం” అంటే, మరొకరు “వద్దు.. అధ్యక్షుడు తన కలలో ఇరాన్‌ను గెలుచుకోవడం గురించి ఆలోచిస్తున్నారు, అలాగే ఉండనివ్వండి” అని సమాధానమిస్తారు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో ప్రారంభమైన ఈ సంఘర్షణ ఇప్పుడు మధ్యప్రాచ్యం అంతటా విస్తరించింది. ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి.

సోషల్ మీడియా స్పందన: ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  • “అమెరికా ఎలా పనిచేస్తుందో మీకు తెలియదు. మీరు కేవలం ట్రంప్‌తో యుద్ధం చేయడం లేదు. ఇలాంటి కార్టూన్లు వేసి అద్భుతాలు జరుగుతాయని ఆశించడం సరైన వ్యూహం కాదు” అని ఒక యూజర్ విమర్శించారు.
  • “పాపం ట్రంప్” అని మరొకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

‘తాళాలు పోయాయి’ అంటూ జోకులు: హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరవాలంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలపై కూడా ఇరాన్ గతంలో ఇలాగే స్పందించింది. ఆ కీలకమైన సముద్ర మార్గానికి సంబంధించిన “తాళాలు పోయాయి” (Lost the keys) అంటూ జోకులు పేల్చింది. నిర్ణీత గడువులోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై విధ్వంసకర దాడులు చేస్తామని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.


Posted

in

by

Tags: