ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్న 10 రాష్ట్రాలు.! సెనేట్‌లో మెజారిటీ చేజారితే వైట్‌హౌస్ అధికార సమీకరణాలు మారుతాయా..? అమెరికాను ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తున్న మధ్యంతర ఎన్నికలు.!!

అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు కీలక రాజకీయ పరీక్షగా మారనున్నాయి.

ఈ ఎన్నికల్లో చట్టసభలోని (కాంగ్రెస్) రెండు సభలైన.. ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) లోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 100 స్థానాలకు గానూ 35 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీకి 53 స్థానాలు, డెమొక్రాటిక్ పార్టీకి 45 స్థానాలు ఉన్నాయి. డెమొక్రాట్లతో కలిసి పనిచేసే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. సెనేట్‌లో మెజారిటీ సాధించాలంటే డెమొక్రాట్లకు కనీసం మరో నాలుగు స్థానాలు అదనంగా అవసరం.

ఈ ఎన్నికల్లో 10 రాష్ట్రాల్లో జరిగే సెనేట్ స్థానాల పోటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రిపబ్లికన్ పార్టీకి బలమైన మద్దతు ఉందని భావించే కొన్ని రాష్ట్రాల్లో కూడా పోటీ తీవ్రంగా మారింది. ద్రవ్యోల్బణం, ఇరాన్‌తో యుద్ధ వాతావరణం, ఇంధన ధరల పెరుగుదల, వ్యవసాయ ఖర్చులు వంటివి ఓటర్లను ప్రభావితం చేసే ప్రధాన సమస్యలుగా మారాయి. దీంతో సెనేట్‌లో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్ల మెజారిటీ కొనసాగుతుందా లేదా అన్న ప్రశ్న తలెత్తింది.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకోసారి జరుగుతుండగా, చట్టసభల ఎన్నికలు రెండేళ్లకోసారి జరుగుతాయి. అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీకాలం మధ్యలో జరిగే ఎన్నికలనే ‘మధ్యంతర ఎన్నికలు’ అంటారు. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. సెనేట్ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు కావడంతో, ప్రతి రెండేళ్లకోసారి మూడో వంతు (సుమారు 33 శాతానికి పైగా) స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు.

ప్రతినిధుల సభ లేదా సెనేట్‌లో డెమొక్రాటిక్ పార్టీ మెజారిటీ సాధిస్తే, పార్లమెంటులో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలను ప్రశ్నించడానికి, దర్యాప్తులను వేగవంతం చేయడానికి వారికి ఎక్కువ అవకాశం లభిస్తుంది. అదే సమయంలో, కీలక చట్టాలు, నియామకాలకు సంబంధించిన నిర్ణయాలలో కూడా రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశముంది. అయితే, ఈ ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయినంత మాత్రాన అధ్యక్షుడి పదవికి వచ్చిన ముప్పేమీ ఉండదు. కానీ, రాబోయే రెండేళ్లపాటు ట్రంప్ పాలనలోని రాజకీయ ముఖచిత్రాన్ని, వాతావరణాన్ని నిర్ణయించడంలో ఈ ఎన్నికల ఫలితాలు కీలక పాత్ర పోషిస్తాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *