ట్రెకింగ్‌లో మృత్యుఘోష: పేలని బాంబును కాలితో తన్నిన విద్యార్థి.. క్షణాల్లో ఛిన్నాభిన్నమైన ప్రాణం!

చెన్నై: సరదాగా సాగిన ట్రెకింగ్ కాస్తా ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అప్పటివరకు ఉత్సాహంగా కొండలు ఎక్కిన ఆ యువకుడిని ఒక చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తెచ్చింది. తమిళనాడులోని సింగపెరుమాళ్ కోయిల్ సమీపంలో ఉన్న రక్షణ శాఖ (Defence Zone) ఫైరింగ్ రేంజ్ వద్ద జరిగిన భారీ పేలుడులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు.

అసలేం జరిగింది?

బెంగళూరుకు చెందిన హిమాన్షు యాదవ్ (21), ఎస్ఆర్ఎం (SRM) ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం తన ఐదుగురు స్నేహితులతో కలిసి హనుమంతపురం ఫైరింగ్ రేంజ్ సమీపంలోని కొండపైకి ట్రెకింగ్‌కు వెళ్లాడు. అయితే, అది నిషేధిత ప్రాంతం కావడంతో అనుమతి లేకుండానే వీరు కొండపైకి ఎక్కారు.

కాలితో తన్నాడు.. కాలయముడై ముంచుకొచ్చాడు!

కొండపైకి చేరుకున్న విద్యార్థులకు అక్కడ ఒక లోహపు వస్తువు కనిపించింది. అది రక్షణ దళాలు వాడి వదిలేసిన, పేలని బాంబు (Unexploded Shell) అని వారు గుర్తించలేకపోయారు. ఆ వస్తువును చూసిన హిమాన్షు, సరదాగా దాన్ని కాలితో తన్నాడు. ఆ వస్తువు పక్కనే ఉన్న రాయిని బలంగా తాకడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది.

ఈ భీకర పేలుడు ధాటికి హిమాన్షు ఛాతీ, భుజం, చేతులు ఛిన్నాభిన్నమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

మరో నలుగురికి తీవ్ర గాయాలు

ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి విశాల్ వేణుగోపాల్ (21) ఎడమచేయి, వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు ఆర్యన్ శర్మ (యూపీ), కృష్ణ సిరాజ్ మహాజన్ (జమ్మూ), నిష్కాస్ నీరజ్ (ఢిల్లీ) కూడా గాయపడ్డారు. మీరట్‌కు చెందిన విరాట్ సంజయ్ కుమార్ అనే విద్యార్థి మాత్రం అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు.

పోలీసుల దర్యాప్తు.. భద్రతా వైఫల్యమా?

సమాచారం అందుకున్న సింగపెరుమాళ్ కోయిల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పొతేరిలోని ఎస్ఆర్ఎం ఆసుపత్రికి తరలించారు. భద్రతా దళాలు ప్రాక్టీస్ కోసం వాడే ఈ ఫైరింగ్ రేంజ్‌లో పేలని బాంబు ఎలా ఉండిపోయింది? విద్యార్థులు నిషేధిత ప్రాంతంలోకి ఎలా వెళ్లారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు హిమాన్షు తండ్రి రమేష్ సింగ్ బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు. ఆశయాల అంచున ఉన్న కొడుకు ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.


Posted

in

by

Tags: