డబ్బులిస్తేనే ఆడనిస్తారా? “క్రికెట్ ఆడేందుకు ఆటగాళ్ల వద్దే లంచం అడిగిన పీసీబీ”. అది కూడా ఒక్కో ఆటగాడికి రూ. 8 లక్షలు. అంతర్జాతీయ స్థాయిలో మరోసారి పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్.!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), దాని చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తమ విచిత్రమైన, వివాదాస్పద నిర్ణయాలతో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో మరోసారి తీవ్ర విమర్శల పాలయ్యారు.

విదేశీ టీ20, టీ10 లీగ్‌లలో ఆడేందుకు తమ దేశ ఆటగాళ్లకు ఇవ్వాల్సిన ‘నిరభ్యంతర పత్రం’ (NOC) కోసం పీసీబీ నేరుగా డబ్బులు డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

అబుదాబి టీ10 లీగ్‌లో పాల్గొనాల్సిన 16 మంది పాకిస్థాన్ ఆటగాళ్ల ఎన్‌ఓసీ (NOC) అనుమతిని బోర్డు అకస్మాత్తుగా నిలిపివేసింది. ఒక్కో ఆటగాడికి 10,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 8.3 లక్షలు) ఫీజుగా చెల్లించాలని పీసీబీ కరాఖండిగా చెప్పింది. టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఈ వివాదం తలెత్తడంతో ఫ్రాంచైజీ జట్లు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. పరిస్థితి విషమించడంతో, ఎలాగైనా టోర్నీలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో కొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు తమ సొంత మ్యాచ్ ఫీజు, జీతం డబ్బులు ఇచ్చి ఎన్‌ఓసీ పొందేందుకు సిద్ధమైన దయనీయ పరిస్థితి నెలకొంది.

ఈ లీగ్ ప్లేయర్ డ్రాఫ్ట్‌లో నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ వాసిం జూనియర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, ఆజం ఖాన్, అబ్బాస్ ఆఫ్రిదితో సహా 16 మంది అగ్రశ్రేణి పాకిస్థాన్ స్టార్లను వివిధ జట్లు ఎంపిక చేసుకున్నాయి. పీసీబీ ధన దాహం కారణంగా ఈ ఆటగాళ్ల క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా, ప్రత్యామ్నాయ ఆటగాళ్లను వెతుక్కోవాల్సిన పరిస్థితికి జట్లు నెట్టబడ్డాయి.

చివరకు ‘జియో న్యూస్’ కథనం ప్రకారం, పీసీబీ మరియు అబుదాబి టీ10 లీగ్ యాజమాన్యం మధ్య రాజీ కుదిరింది. దీని ఆధారంగా లీగ్ నిర్వాహకులు పీసీబీకి పరిహారంగా సుమారు 2 లక్షల అమెరికన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.66 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించారు. ఈ ఒప్పందం తర్వాత, పీసీబీ ఆటగాళ్లందరికీ ఎన్‌ఓసీ జారీ చేయడంతో, నవంబర్ 7 నుంచి ప్రారంభమై కొనసాగుతున్న టోర్నీలో పాకిస్థాన్ ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు మార్గం సుగమమైంది.

విదేశీ లీగ్‌ల నుంచి డబ్బులు గుంజడం పీసీబీకి ఇది తొలిసారి కాదు. గత నెలలో నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు వెళ్లిన ఆటగాళ్లను కూడా పీసీబీ ఒక్కొక్కరికి 25,000 డాలర్లు డిమాండ్ చేయడంతో పలువురు ఆటగాళ్లు మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు విదేశీ ఆటగాళ్ల రాక తగ్గడాన్ని భర్తీ చేసుకునేందుకు, ఇతర లీగ్‌ల ద్వారా పీసీబీ సాగిస్తున్న ఈ వసూళ్ల దందా ఆటగాళ్ల జీవనోపాధిని దెబ్బతీస్తోందని క్రికెట్ నిపుణులు తీవ్రంగా మండిపడుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *