‘డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు…’: మిస్సింగ్ కేసుల వార్తలపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన.

ఢిల్లీలో ప్రజలు అకస్మాత్తుగా అదృశ్యమవుతున్నారనే వార్తలు కలకలం రేపిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పరిస్థితిని వివరించారు. 2026 ప్రారంభం నుండి గడిచిన 36 రోజుల్లో 2,884 మంది అదృశ్యమయ్యారని, వారిలో కేవలం 409 మంది మాత్రమే దొరికారని వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయి.

జనవరి 1 నుండి ఫిబ్రవరి 5 మధ్య 616 మంది పిల్లలు, 1,372 మంది మహిళలు కనిపించకుండా పోయారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనివల్ల ప్రజల్లో అభద్రతాభావం ఏర్పడింది.

ఢిల్లీ పోలీసుల ప్రకటన – పెయిడ్ ప్రమోషన్ ఆరోపణ: ఈ అంశంపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ ‘X’ (ట్విట్టర్) లో ఒక పోస్ట్ చేశారు. ఢిల్లీలో బాలికల అదృశ్యం పెరిగిందని జరుగుతున్న ప్రచారం అంతా “పెయిడ్ ప్రమోషన్” (డబ్బులు ఇచ్చి చేయిస్తున్న ప్రచారం) అని పోలీసులు తేల్చి చెప్పారు. కేవలం డబ్బు కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అధికారిక వివరణ: జాయింట్ కమిషనర్ సంజయ్ త్యాగి మాట్లాడుతూ.. గత ఏళ్లతో పోలిస్తే 2026 జనవరిలో మిస్సింగ్ కేసులు ఏమీ పెరగలేదని, పైగా తగ్గుముఖం పట్టాయని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో మిస్సింగ్ పర్సన్ స్క్వాడ్ మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు చురుగ్గా పనిచేస్తున్నాయని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.


Posted

in

by

Tags: