కబోర్డ్ లేదా అలమరా అనేది మన ఇంట్లో బట్టలు, డబ్బు మరియు విలువైన వస్తువులను దాచుకునే ముఖ్యమైన వస్తువు. అందుకే వాస్తు శాస్త్రంలో అలమరాను ఆనందానికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. చాలామంది ఇంట్లో స్థలం సరిపోక లేదా సౌకర్యం కోసం అలమరా పైన పుస్తకాలు, పాత బట్టలు, బ్యాగులు మరియు ఇతర అనవసరమైన వస్తువులను కుప్పగా పెడుతుంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ అలవాటు ఇంట్లోని సానుకూల శక్తి (Positive Energy) పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల క్రమంగా అనేక సమస్యలు తలెత్తుతాయి.
- మానసిక ఒత్తిడి: అలమరా పైన బరువుగా వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లోని సభ్యులలో అశాంతి, ఒత్తిడి పెరుగుతాయి. వారు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ఇది కేవలం మానసిక స్థితిపైనే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
- ఆరోగ్య సమస్యలు: ఇలా సామాన్లు పేరుకుపోవడం వల్ల ఇంట్లోని వారు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా ఇంటి యజమాని దైనందిన జీవితంపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- ఆర్థిక ఇబ్బందులు: అలమరా పైన సామాన్లు ఉండటం వల్ల ధన ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఇంట్లోకి డబ్బు వస్తుంది కానీ నిలవదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వాస్తు ప్రకారం, దీనివల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది, తద్వారా ఇంటి అభివృద్ధి మందగిస్తుంది.
పరిష్కారం: మొదట అలమరా పైన ఉన్న అనవసరమైన, పాత వస్తువులను తొలగించండి. ఇంట్లో వాడని వస్తువులను తీసేసి, మిగిలిన వాటిని పద్ధతిగా సర్దుకోండి. అలమరాను ఎప్పుడూ శుభ్రంగా, తేలికగా ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. అవసరమైతే అలమరా దగ్గర సువాసన వచ్చే అగరుబత్తులు లేదా చిన్న మొక్కలను ఉంచడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
