పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, చేతి నిండా డబ్బు ఉంటేనే సంతోషంగా జీవించగలమని చాలా మంది అనుకుంటారు.
కానీ, కొన్నిసార్లు కుటుంబంతో గడిపే ఓ చిన్న క్షణం కూడా మనసుకు అవధులు లేని ఆనందాన్ని ఇస్తుందని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం వీడియో నిరూపించింది. దుర్గా పూజ సందర్భంగా కోల్‌కతా వీధుల్లో రిక్షాలో ప్రయాణిస్తూ భార్యాభర్తలిద్దరూ కలిసి పాట పాడుతూ ఆనందిస్తున్న 20 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర కోల్‌కతాలో దుర్గా పూజ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన వీధుల్లో కళ్లద్దాలు పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్య, చిన్న కుమారుడితో కలిసి రిక్షాలో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ఓ పాట సాహిత్యం గుర్తుందా అని తన భార్యను అడుగుతాడు. ఆ వెంటనే ‘దుర్గా మా ఆష్చే’ అనే పాట వినిపించగా, భార్య కూడా అతడితో గొంతు కలిపి పాడటం మొదలుపెడుతుంది. వారిద్దరి ముఖాల్లో కనిపించే చిరునవ్వు, పక్కనే కూర్చున్న చిన్నారి సంతోషం చూపరులను కట్టిపడేశాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో ఎంతో మంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఎక్స్ (X) వేదికగా షేర్ చేసిన ఈ పోస్ట్‌ను ఇప్పటికే 30 లక్షల మందికి పైగా వీక్షించారు. డబ్బు సంపాదించడం, పెద్ద ఇల్లు కొనడం అనే పరుగులో పడి చాలా మంది ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నారని కొందరు అభిప్రాయపడ్డారు. అలాగే తల్లిదండ్రులతో పిల్లలు గడిపే ఇలాంటి సరళమైన క్షణాలే వారికి జీవితకాల జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని మరికొందరు పేర్కొన్నారు.
ఈ కుటుంబం వీడియో అందరి మనసులను కదిలించడానికి ప్రధాన కారణం అందులో కనిపించే నిరాడంబరమైన సంతోషమే. ఖరీదైన వినోదాలు లేకపోయినా, నచ్చిన పాట పాడుకుంటూ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఆనందంగా ఉండొచ్చని ఈ దృశ్యం గుర్తుచేస్తోంది. జీవితంలో సంతోషం కోసం ఎక్కడికో వెతుక్కుంటూ వెళ్లాల్సిన పనిలేదని, కొన్నిసార్లు మనతో ఉన్నవారితో పంచుకునే చిన్న చిన్న క్షణాలే సరిపోతాయని ఈ 20 సెకన్ల వీడియో చాటిచెబుతోంది.

Leave a Reply