వారణాసి: దైవంతో సమానంగా భావించే వైద్యులే యమదూతలుగా మారిన ఘటన వారణాసిలోని ప్రతిష్టాత్మక బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) ట్రామా సెంటర్లో వెలుగుచూసింది. పేర్లలో ఉన్న పోలికను సాకుగా చూపి, ఒక రోగికి చేయాల్సిన ఆపరేషన్‌ను మరొకరికి చేసి.. చివరకు ఒక ప్రాణం బలి కావడానికి కారణమయ్యారు. వెన్నెముక సమస్యతో వెళ్లిన బాధితురాలికి, ఏ సంబంధం లేని తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేసి ఆమె మరణానికి బాటలు వేశారు.
పేర్లు ఒకటే.. ప్రాణాలు తీశాయి!
ఈ విషాద గాథ వివరాల్లోకి వెళితే.. బల్లియా జిల్లాకు చెందిన రాధికా దేవి (71) వెన్నెముకలోని కణితి (Spinal Tumour) చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అదే సమయంలో రాధికా సింగ్ (82) అనే మరో మహిళ తుంటి మార్పిడి (Hip Replacement) శస్త్రచికిత్స కోసం చేరారు. ఇద్దరి పేర్లు ‘రాధికా’ అని ఉండటంతో వైద్య బృందం తీవ్ర నిర్లక్ష్యానికి ఒడిగట్టింది. వెన్నెముక ఆపరేషన్ చేయాల్సిన రాధికా దేవిని తుంటి ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు.
ఆపరేషన్ మధ్యలో మేల్కొన్న వైద్యులు
మార్చి 7న ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు రాధికా దేవికి అనస్థీషియా ఇచ్చి తుంటి వద్ద కోత కోశారు. అయితే, ఆపరేషన్ చేస్తున్న సమయంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అసలు సమస్యను గుర్తించలేకపోయారు. ఇంతలో ఒక నర్సింగ్ సిబ్బంది వచ్చి “తప్పుడు పేషెంట్‌ను థియేటర్‌కు తెచ్చారు” అని చెప్పడంతో డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. తప్పు జరిగిందని గ్రహించిన వైద్యులు, కంగారుగా కోతను కుట్టేసి, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఆమెను తిరిగి వార్డుకు పంపించేశారు.
డబుల్ సర్జరీ.. తట్టుకోలేక మృతి
ఆ తర్వాత మార్చి 18న న్యూరో విభాగం వైద్యులు ఆమెకు వెన్నెముక ఆపరేషన్ చేశారు. కేవలం పది రోజుల వ్యవధిలో రెండు భారీ శస్త్రచికిత్సలు జరగడం, అనస్థీషియా ప్రభావం, మరియు జరిగిన పొరపాటు వల్ల కలిగిన మానసిక క్షోభతో రాధికా దేవి ఆరోగ్యం క్షీణించింది. చివరకు మార్చి 28న ఆమె కన్నుమూశారు.
విచారణలోనూ డ్రామాలు:
బాధితురాలి మనవడు మృత్యుంజయ్ పాల్ ఫిర్యాదుతో విచారణ మొదలైంది. అయితే, ఇక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
- పక్షపాత విచారణ: మొదట ఏ డాక్టర్ బృందం అయితే తప్పుడు ఆపరేషన్ చేసిందో, అదే డాక్టర్ నేతృత్వంలో విచారణ కమిటీని వేశారు.
- బాధితుల నిరసన: దీనిపై బాధితుడి కుటుంబం మండిపడటంతో, చివరకు కమిటీ చైర్మన్‌ను మార్చాల్సి వచ్చింది.
