డాక్టర్ ఘాతుకం: మత్తు ఇచ్చి వీడియో తీసి.. 14 నెలల పాటు లైంగిక దాడి! న్యాయం జరగకపోతే ఆత్మహుతి చేసుకుంటానని బాధితురాలు హెచ్చరిక

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ జిల్లాలో మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లో పనిచేసే యువతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేయడమే కాకుండా, అశ్లీల వీడియో తీసి 14 నెలల పాటు బ్లాక్ మెయిల్ చేసినట్లు ఒక డాక్టర్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

పోలీసుల నుండి న్యాయం లభించకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు, సోషల్ మీడియాలో వీడియో విడుదల చేస్తూ ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

మృగత్వం.. బ్లాక్ మెయిల్: బాధితురాలి కథనం ప్రకారం.. మిమ్లానా రోడ్డులో నివసించే డాక్టర్ సులేమాన్ రెండేళ్ల క్రితం ఆమెను ఇంట్లో పనుల కోసం చేర్చుకున్నాడు. ఒకరోజు ఆమెకు ఒంట్లో నలతగా ఉండటంతో, చికిత్స పేరుతో డాక్టర్ ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమె స్పృహలో లేని సమయంలో అత్యాచారం చేయడమే కాకుండా, ఆ ఘోరకలిని వీడియో తీశాడు.

స్పృహలోకి వచ్చాక ఆమె నిలదీయగా.. డాక్టర్ మరియు అతని భార్య ఆబిదా కలిసి ఆ వీడియోను వైరల్ చేస్తామని, చంపేస్తామని బెదిరించారు. ఆ భయం నీడలోనే గత 14 నెలలుగా సదరు డాక్టర్ ఆమెను లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు.

పోలీసుల తీరుపై ఆగ్రహం: మార్చి 6న ధైర్యం తెచ్చుకుని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు నిందితుడిని పట్టుకున్నప్పటికీ, కేవలం కొన్ని గంటల్లోనే వదిలేశారని ఆమె ఆరోపించింది. పోలీసుల నిర్లక్ష్యంతో కుంగిపోయిన యువతి.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తూ, “నా చావుకు అధికారులే బాధ్యత వహించాలి” అని పేర్కొంటూ ఒంటికి నిప్పు పెట్టుకుంటానని హెచ్చరించింది.

అధికారుల స్పందన: ఈ వీడియో వైరల్ కావడంతో పోలీస్ యంత్రాంగంలో అలజడి మొదలైంది. విషయం తీవ్రతను గమనించిన ఎస్ఎస్‌పి (SSP) సంజయ్ కుమార్ వర్మ వెంటనే జోక్యం చేసుకున్నారు. కేసు దర్యాప్తు బాధ్యతలను ఎస్పీ క్రైమ్ ఇందు సిద్ధార్థ్‌కు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఆ వీడియో మరియు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా డాక్టర్ సులేమాన్ మరియు అతని భార్యపై ఆధారాలు సేకరిస్తున్నారు.


Posted

in

by

Tags: