వైద్యుడు ఇచ్చిన తప్పుడు మందులు ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చాయి. నేడు ఆమె బ్రతకడం కోసం నరకయాతన అనుభవిస్తోంది. ఒక డాక్టర్ తన పరిధిని దాటి ఇచ్చిన హై-డోస్ అల్లోపతి మందుల వల్ల 28 ఏళ్ల మహిళ మృత్యువుతో పోరాడుతోంది. గత 203 రోజులుగా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆమె చికిత్స కోసం భర్త తన ఇల్లు, ప్లాట్, వాహనాలు అన్నీ అమ్మేసి సుమారు 15 నుండి 16 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఈ ఘటనపై సిటీ చౌక్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ మహ్మద్ ఇబ్రహీం సౌదాగర్పై కేసు నమోదైంది.
అసలేం జరిగింది? బాధితురాలు రైసా ఖాన్ జూన్ 12, 2025న కంటి సమస్యతో బాధపడుతూ మహారాష్ట్ర షహాబజార్ ప్రాంతంలోని ఒక క్లినిక్‌కు వెళ్లారు. అక్కడ ‘అష్-షిఫా ఛారిటబుల్ క్లినిక్’ నడుపుతున్న డాక్టర్ సౌదాగర్, ఆమెను నిపుణులైన కంటి డాక్టర్ వద్దకు పంపాల్సింది పోయి, స్వయంగా కొన్ని హై-డోస్ అల్లోపతి మాత్రలు రాసిచ్చారు.
మందుల వికటించి ముఖం వికారం: ఆ మాత్రలు వేసుకున్న రెండు రోజుల్లోనే రైసా శరీరంపై భయంకరమైన దుష్ప్రభావాలు (Side Effects) కనిపించాయి. ఆమె ముఖం పూర్తిగా వికృతంగా మారిపోవడమే కాకుండా, తీవ్రమైన గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో జూన్ 16, 2025న ఆమెను ఎంజిఎం ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుండి ఆమె వెంటిలేటర్‌పైనే ఉన్నారు. కనీసం సొంతంగా శ్వాస తీసుకోవడం లేదా ఆహారం తీసుకోవడం కూడా ఆమెకు కష్టంగా మారింది.
నివేదికలో షాకింగ్ నిజాలు: ప్రభుత్వ వైద్య కళాశాల కమిటీ ఈ విషయంపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో నిందితుడు డాక్టర్ సౌదాగర్ కేవలం BUMS (యునాని) డాక్టర్ అని, అతనికి అల్లోపతి మందులు ఇచ్చే చట్టబద్ధమైన అనుమతి లేదని తేలింది. అయినప్పటికీ అతను తెలిసి కూడా ఆ మందులు ఇవ్వడం వల్లే మహిళ ప్రాణం ప్రమాదంలో పడిందని కమిటీ స్పష్టం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్య కోసం సర్వస్వం త్యాగం: తన భార్యను బ్రతికించుకోవడానికి ఆమె భర్త బావా ఖాన్ పడరాని పాట్లు పడుతున్నారు. చికిత్స ఖర్చుల కోసం తన ప్లాట్, బైక్, ఇతర ఆస్తులన్నీ అమ్మేశారు. ఇప్పటికే 16 లక్షలు ఖర్చు చేసినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా పూర్తిగా చితికిపోయింది.
