డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ; టారిఫ్‌లు చట్టవిరుద్ధమని తీర్పు!

ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. నేషనల్ ఎమర్జెన్సీ కోసం ఉద్దేశించిన ఫెడరల్ చట్టం కింద ట్రంప్ అమలు చేసిన గ్లోబల్ టారిఫ్‌లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.

వ్యాపార ప్రయోజనాల కోసం అత్యవసర అధికారాలను (Emergency Powers) ఉపయోగించడాన్ని కోర్టు తోసిపుచ్చింది. టారిఫ్‌ల వల్ల ప్రభావితమైన వ్యాపారవేత్తలు, 12 అమెరికా రాష్ట్రాలు దీనిని కోర్టులో సవాలు చేశాయి. ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ (IEEPA) కింద తనకు లభించిన అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేశారని దిగువ కోర్టులు ఇప్పటికే అభిప్రాయపడ్డాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం టారిఫ్‌లు విధించే అధికారం కాంగ్రెస్‌కు (పార్లమెంట్) మాత్రమే ఉంటుంది. గతంలో అధ్యక్షులు ఈ చట్టాన్ని నిషేధాలు విధించడానికి ఉపయోగించినప్పటికీ, దిగుమతులపై భారీగా పన్నులు వేయడానికి ఉపయోగించిన మొదటి అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే.

రెసిప్రోకల్ టారిఫ్‌లు చట్టవిరుద్ధం: అత్యవసర అధికారాలను ఉపయోగించి టారిఫ్‌లు విధించే హక్కు ట్రంప్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెరుగుతున్న వాణిజ్య లోటు (Trade Deficit) అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొంటూ ఏప్రిల్ 2025లో ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీనిని ఆధారం చేసుకుని చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాల నుండి వచ్చే వస్తువులపై భారీ దిగుమతి సుంకాలు విధించారు. అయితే, ఎమర్జెన్సీ పవర్స్ చట్టంలో టారిఫ్‌లు విధించడానికి స్పష్టమైన అనుమతి లేదని కోర్టు పేర్కొంది.


Posted

in

by

Tags: