డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం: ఇక మీ చావు మీరు చావండి… చేతులెత్తేసిన ట్రంప్! హార్ముజ్ విషయంలో ఇతర దేశాలకు ఉచిత సలహా.. పెరగనున్న చమురు మంటలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-ఇరాన్ సంఘర్షణల నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, తమ దేశ సైనిక చర్యకు అద్భుతమైన విజయం లభించిందని ప్రకటించారు. తన ప్రసంగంలో యుద్ధం మరియు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన చమురు సంక్షోభంపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

అమెరికా ఇకపై ఏ విదేశీ చమురు సరఫరాపై ఆధారపడాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టమైన మాటల్లో చెప్పారు. ఇతర దేశాలు తమ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి స్వయంగా చొరవ చూపాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి విషయంలో మాట్లాడుతూ.. మధ్యప్రాచ్య చమురుపై ఆధారపడే దేశాలే ఈ కీలక సముద్ర మార్గాన్ని సురక్షితంగా మరియు తెరిచి ఉంచే బాధ్యతను తీసుకోవాలని అన్నారు. అమెరికా ఇందులో ఎటువంటి ముందడుగు వేయదని, ఇతర దేశాలే ముందుకు వచ్చి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.

ఇంధన సరఫరా పూర్తిగా అస్తవ్యస్తం
హార్ముజ్ మార్గం ద్వారా వెళ్లే చమురు నౌకలపై దాడులు చేస్తామన్న ఇరాన్ హెచ్చరికల వల్ల ప్రపంచ ఇంధన సరఫరా పూర్తిగా అస్తవ్యస్తమైందని, దీనివల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో పెను అలజడి నెలకొందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన చర్యల్లో పాల్గొనని దేశాలపై ఆయన విమర్శలు గుప్పించారు. అటువంటి దేశాలు ధైర్యం చేసి సొంతంగా హార్ముజ్ జలసంధి నుండి చమురు తెచ్చుకోవాలని లేదా నేరుగా అమెరికా వద్దే చమురు కొనుగోలు చేయాలని ఆయన ఆప్షన్ ఇచ్చారు.

అమెరికా ఇకపై ఏ పరిస్థితిలోనూ తన మిత్రదేశాలను రక్షించే బాధ్యతను (చమురు రక్షణ విషయంలో) తీసుకోదని ట్రంప్ స్పష్టం చేయడం అంతర్జాతీయ సహకార ధోరణికి విరుద్ధమని భావిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికాకు అండగా నిలబడ్డాయని, వారికి ఎటువంటి హాని కలగనివ్వబోమని ఆయన హామీ ఇచ్చారు.

ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ట్రంప్
ఇరాన్‌ను తీవ్రంగా విమర్శిస్తూ.. ఆ దేశం అనేక దేశాలపై దాడులు చేసిందని, కాబట్టి దానికి అణ్వస్త్రాలు పొందే అనుమతి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని ట్రంప్ అన్నారు. “మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం వల్ల అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ఈ తాత్కాలిక ధరల పెరుగుదలకు ఇరాన్ జరిపిన హింసాత్మక ఉగ్రవాద దాడులే కారణం. అణ్వాయుధాల విషయంలో ఇరాన్‌ను ఎన్నటికీ నమ్మలేం. వారు వాటిని వాడితే దశాబ్దాల పాటు ఆర్థిక సంక్షోభం, ఊహించని అస్థిరత ఏర్పడుతుంది” అని హెచ్చరించారు.


Posted

in

by

Tags: