డ్యాన్స్ పార్టీలు, 800 మంది సంపన్న క్లయింట్లు.. లేడీ డాన్ 17 ఏళ్ల బహిరంగ వ్యాపారం, తాకడానికే భయపడిన పోలీసులు

నేర ప్రపంచంలో ‘డాన్’ అనే పదం వినగానే మన కళ్లముందు ఒక భయంకరమైన పురుషుడి ముఖం మెదులుతుంది. కానీ చట్టాన్ని, సమాజాన్ని గడగడలాడించిన లేడీ డాన్లు కూడా ఉన్నారు. వారి పేరు వింటే సామాన్య ప్రజలే కాదు, పోలీసులు కూడా వణికిపోతారు. వారిని తాకడానికి కూడా పోలీసులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన అటువంటి ఒక లేడీ డాన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

కరాచీ నగరంలో గత 17 ఏళ్లుగా అండర్‌వరల్డ్ మరియు డ్రగ్స్ మార్కెట్‌ను ఒక మహిళ శాసిస్తోంది. బలోచ్ పారాకు చెందిన ‘అన్మోల్’, సంపన్నుల విందుల్లో ‘పింకీ’గా ప్రసిద్ధి చెందింది. గార్డెన్ పోలీసులు బుధవారం ఈమెను అరెస్ట్ చేశారు. నగరంలో అత్యంత చురుకైన కొకైన్ మరియు డ్రగ్స్ సరఫరాదారు ఈమె. అయితే, ఈమె అరెస్ట్ పోలీసుల విజయం కంటే కూడా, రెండు దశాబ్దాలుగా ఈ నల్లధనం వ్యాపారం అభివృద్ధి చెందడానికి సహకరించిన వ్యవస్థలోని లోపాలను మరియు అధికారుల కుమ్మక్కును ఎత్తిచూపుతోంది.

అన్మోల్ నుండి ‘పింకీ’గా మారిన ప్రయాణం
అన్మోల్ కథ ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. ఆమె 2008లో తన నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. సాధారణ వీధుల్లో డ్రగ్స్ అమ్మకుండా, చాలా తెలివిగా కరాచీలోని అత్యంత సంపన్న ప్రాంతాలైన డిఫెన్స్ మరియు క్లిఫ్టన్ ఏరియాలను తన లక్ష్యంగా చేసుకుంది. అక్కడ జరిగే ‘ప్రైవేట్ డ్యాన్స్ పార్టీల’కు కొకైన్ సరఫరా చేయడం ద్వారా ‘పింకీ’ అనే ఒక బ్రాండ్‌ను సృష్టించింది. సంపన్న క్లయింట్లు అడిగినంత డబ్బు ఇస్తారని, పోలీసులకు ఎప్పుడూ నోరు విప్పరని ఆమెకు తెలుసు. ఇదే ఆమెను లేడీ డాన్‌గా మార్చింది.

800 మంది క్లయింట్లు, ఆన్‌లైన్ డెలివరీ
పింకీ నెట్‌వర్క్ ఒక కార్పొరేట్ కంపెనీలా పనిచేసేది. అరెస్ట్ సమయానికి ఆమె వద్ద 800 మందికి పైగా వీఐపీ క్లయింట్లు ఉన్నారు. తన నెట్‌వర్క్‌లో పురుషులు మరియు మహిళా ఏజెంట్లను నియమించుకుంది. ఆమె వ్యాపారం కేవలం కరాచీకే పరిమితం కాకుండా ఇతర నగరాలకు, యూనివర్సిటీ క్యాంపస్‌లకు కూడా పాకింది. కాలక్రమేణా ఆన్‌లైన్ ద్వారా కూడా డ్రగ్స్ డెలివరీ చేయడం ప్రారంభించింది.

బుటిక్ అనేది ఒక ముసుగు మాత్రమే
తన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి లాహోర్‌లో ఒక బట్టల వ్యాపారాన్ని (Boutique) ముసుగుగా పెట్టుకుంది. గత ఏడాది జరిగిన ఒక డ్రగ్స్ కేసుతో ఈమె పేరు బయటకు రావడంతో లాహోర్, ఇస్లామాబాద్‌లకు మకాం మారుస్తూ రిమోట్ కంట్రోల్ ద్వారా వ్యాపారాన్ని నడిపించింది.

అరెస్టా లేక వీఐపీ మర్యాదలా?
బుధవారం పింకీని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అక్కడి దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 17 ఏళ్ల పాటు నగరంలో విషాన్ని నింపిన ఈమె చేతులకు కనీసం సంకెళ్లు కూడా వేయలేదు. పోలీసులు ఆమెకు ఒక వీఐపీ అతిథిలా మర్యాదలు చేస్తూ తీసుకెళ్లడం వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది.


Posted

in

by

Tags: