డ్రగ్స్ అరికట్టాల్సిన పోలీసు అధికారిపైనే మత్తు పదార్థాల ఆరోపణలు.. పాజిటివ్‌గా వచ్చిన పరీక్షలు! రోడ్డుపై ప్రజల ఆందోళన

పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ఓ పోలీసు అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) నిషేధిత మత్తు పదార్థమైన ‘చిట్టా’ను వినియోగించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. స్థానికుల ఫిర్యాదుతో నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించారు.

బుధ్లాడా ప్రాంతంలోని జహాన్ కేలన్‌లో శిక్షణ పొందుతున్న సదరు ఏఎస్ఐ, బుధ్లాడా పరిధిలో ఉన్న సమయంలో మత్తు పదార్థాలు వినియోగించినట్లు స్థానికులు ఆరోపించారు. ఆయన డ్రగ్స్ తీసుకోవడాన్ని ప్రత్యక్షంగా చూశామని కొందరు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ ప్రాంతంలో కొందరు మహిళలు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారంటూ స్థానిక మహిళలు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఏఎస్ఐకి డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా ఫలితం పాజిటివ్‌గా వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై బుధ్లాడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే పోలీసులు సదరు ఏఎస్ఐని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. భద్రతా కారణాలతో పోలీసులు ఆ అధికారిని సమీపంలోని ఓ వాహనాల షోరూమ్‌కు తీసుకెళ్లారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు షోరూమ్ అద్దాల తలుపులను ధ్వంసం చేయడంతో పాటు ఐటీఐ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీస్ సూపరింటెండెంట్ నరిందర్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని, ఏఎస్ఐకి నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా వచ్చినట్లు వెల్లడించారు. ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. మరోవైపు, తమ షోరూమ్‌లో జరిగిన విధ్వంసంపై దాని యజమాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే మాన్సా ప్రాంతంలో డ్రగ్స్ నిర్మూలన చర్యలపై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో, పోలీసు అధికారిపై వచ్చిన ఈ ఆరోపణలు మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయి. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


Posted

in

by

Tags: