డ్రమ్ మర్డర్ కేస్: ఈసారి భర్త కాదు ప్రియుడి మృతదేహాన్ని పచ్చ రంగు డ్రమ్‌లో కుక్కారు!

ముంబ్రా డ్రమ్ మర్డర్ కేస్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కొన్నాళ్ల క్రితం ఒక ‘డ్రమ్ కాండ’ (డ్రమ్ హత్యోదంతం) జరిగింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి, శవాన్ని సిమెంట్‌తో నింపిన డ్రమ్‌లో పెట్టి పాతిపెట్టింది.

ఇప్పుడు అలాంటి ఘటనే ముంబైలోనూ పునరావృతమైంది. ముంబైలోని ముంబ్రా పరిధిలో ఒక దిగ్భ్రాంతికరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మీరట్, ముంబ్రా ఘటనలకు ఉన్న తేడా అల్లా ఒక్కటే.. అక్కడ భర్త శవం డ్రమ్‌లోకి వెళ్తే, ఇక్కడ ప్రియుడి శవం డ్రమ్‌లోకి చేరింది. ఒక మహిళ తన భర్త, సోదరుడితో కలిసి ఈ భయంకరమైన కుట్రకు తెరలేపింది. మొదట తన ప్రియుడిని హతమార్చి, ఆపై సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి అతని మృతదేహాన్ని పచ్చ రంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో బంధించి, ఆ డ్రమ్‌ను మురికి కాలువలో పడేశారు.

పనికి వెళ్లిన అర్బాజ్ తిరిగి రాలేదు ఈ ఘోరమైన కేసు ఒక మిస్సింగ్ ఫిర్యాదుతో ప్రారంభమైంది. ముంబ్రాలో నివసించే అర్బాజ్ కంసూద్ అలీ ఖాన్ ఒకరోజు దాదర్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. కానీ, అర్బాజ్ ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా అతని ఆచూకీ లభించలేదు. చివరకు వారు ముంబ్రా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు.

మొబైల్ లొకేషన్, కాల్ డేటాతో తేలిన గుట్టు ముంబ్రా పోలీసులు ఈ కేసులోని ఒక్కో లింకును జోడిస్తూ దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. పోలీసులు అర్బాజ్ మొబైల్ కాల్ డేటా రికార్డులను (CDR), చివరి లొకేషన్‌ను పరిశీలించారు. ఆ సమయంలో అర్బాజ్ చివరి లొకేషన్ వర్సోవా ప్రాంతంలో ఉన్నట్లు చూపించింది. విశేషం ఏంటంటే.. సరిగ్గా అదే సమయంలో అతని ప్రియురాలు మెహజబీన్ షేక్ మొబైల్ లొకేషన్ కూడా అక్కడే ఉన్నట్లు తేలింది.

దాంతో పోలీసులకు అనుమానం వచ్చి మెహజబీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మొదట ఆమె పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు తమదైన శైలిలో గట్టిగా నిలదీసేసరికి చివరకు నిజాన్ని అంగీకరించింది. మెహజబీన్ చెప్పిన విషయాలు విని పోలీసులే దిగ్భ్రాంతికి లోనయ్యారు.

నిर्दయంగా హత్య ఒక పక్కా స్కెచ్ ప్రకారమే తాము అర్బాజ్‌ను ఖతం చేసినట్లు మెహజబీన్ అంగీకరించింది. తన భర్త హసన్, సోదరుడు తారిఖ్ షేక్‌లతో కలిసి అర్బాజ్ నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడానికి, అలాగే అతడిని తమ దారి నుంచి తప్పించడానికి ఈ కుట్ర పన్నినట్లు చెప్పింది. ప్లాన్ ప్రకారం.. డబ్బు ఇస్తామనే నెపంతో అర్బాజ్‌ను వర్సోవాకు పిలిపించారు. అయితే అక్కడ డబ్బులు దొరకకపోవడంతో నిందితులు అర్బాజ్‌ను క్రూరంగా చంపేశారు.

అర్బాజ్ కాళ్లు చేతులు కట్టేసి, ప్లాస్టిక్ లావుపాటి పైపులతో శ్వాస ఆగిపోయేంత వరకు విపరీతంగా కొట్టారు. అర్బాజ్ చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని ఒక పెద్ద పచ్చ రంగు డ్రమ్‌లో పెట్టి ముంబ్రాలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న మురికి కాలువలో పడేశారు.

ప్రియురాలు, ఆమె సోదరుడు అరెస్ట్.. భర్త ఫరార్ ముంబ్రా పోలీసుల శీఘ్ర చర్యలు, సాంకేతిక దర్యాప్తు కారణంగా ఈ నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మురికి కాలువ నుండి మృతదేహాన్ని వెలికితీశారు. నిందితురాలైన ప్రియురాలు మెహజబీన్ షేక్, ఆమె సోదరుడు తారిఖ్ షేక్‌లను అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసులో మరో ప్రధాన నిందితుడైన మెహజబీన్ భర్త హసన్, అతని అనుచరుడు ముజమ్మిల్ పఠాన్ ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులు నిందితులందరిపై హత్య, కిడ్నాప్, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాల నిర్మూలన వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.


Posted

in

by

Tags: