పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో తెరిచి ఉన్న డ్రైనేజీ గుంతలు (మ్యాన్‌హోల్స్) చాలా కాలంగా తీవ్ర సమస్యగా మారాయి.
అక్కడి అనేక ప్రాంతాల్లో మ్యాన్‌హోల్‌పై ఉండే ఇనుప మూతలు చోరీకి గురికావడం, పగిలిపోవడం లేదా తొలగించబడటం పరిపాటిగా మారింది. ఫలితంగా రోడ్లపై ప్రమాదకరమైన గుంతలు ఏర్పడి, సాధారణ ప్రజలకు ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రమాదవశాత్తు వాటిలో పడిపోయే ముప్పు పొంచి ఉండటంతో రక్షణ చర్యలు అనివార్యమయ్యాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రస్తుతం డ్రైనేజీ గుంతల లోపల రక్షణ వలలను (సేఫ్టీ నెట్స్) ఏర్పాటు చేస్తోంది. ఒకవేళ మ్యాన్‌హోల్ మూత చోరీకి గురైనా లేదా దెబ్బతిన్నా.. దాని కింద అమర్చిన వల కారణంగా ఎవరైనా నేరుగా లోతైన గుంతలోకి పడిపోకుండా నిరోధించేలా దీన్ని రూపొందించారు. ఈ సేఫ్టీ నెట్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నీలి రంగులో కనిపిస్తున్న ఈ రక్షణ వలలను చూసిన నెటిజన్లు, దీనికి సరదాగా “టూ-ఫ్యాక్టర్ సెక్యూరిటీ” (Two-Factor Security) అని పేరు పెట్టారు. లోపలికి దిగాలంటే ముందుగా మ్యాన్‌హోల్ మూతను తీయాలి, ఆ తర్వాత కిందకు వెళ్లాలంటే వల రూపంలో ఉన్న రెండో సెక్యూరిటీ లేయర్‌ను దాటాలి అంటూ రకరకాలుగా నెటిజన్లు చలోక్తులు విసురుతున్నారు. ఈ సరికొత్త ప్రయోగంపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, హాస్యానికి అతీతంగా దీని వెనుక ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజా భద్రతను నిర్ధారించడమేనని అధికారులు స్పష్టం చేశారు. గతేడాది మే నెలలో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్, ప్రావిన్స్ అంతటా ఉన్న డ్రైనేజీ గుంతలు, మురుగునీటి కాల్వలలో ఇలాంటి రక్షణ వలలను అమర్చాలని అధికారులను ఆదేశించారు. పాలిస్టర్ స్ట్రిప్స్‌తో తయారు చేసిన దృఢమైన వలలను ఇందుకోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం. మూతలు చోరీకి గురైనా లేదా పాడైనా, ఈ అదనపు భద్రతా వలలు ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడతాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
