ఢిల్లీ జీవితాన్ని వదిలేసి గ్రామానికి మకాం మార్చిన కుటుంబం.! నలుగురు సభ్యులు, ఇద్దరు పిల్లలు, ఒక కుక్క. నెల ఖర్చు కేవలం రూ.32,000 మాత్రమే.! అక్కడ లభించే జీవన సౌకర్యాలను చూడండి.!!

మహానగర జీవితం అంటేనే అధిక ఖర్చులు, ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం వంటి ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో 20 ఏళ్ల పాటు నివసించిన 37 ఏళ్ల మహిళ, తన భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక పెంపుడు కుక్కతో సిటీ లైఫ్‌ను వదిలేసి సిక్కిం రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో స్థిరపడింది. అక్కడ ఆరు నెలలు జీవించిన తర్వాత, ఆమె తన కుటుంబ నెలవారీ ఖర్చుల వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంది. నలుగురు సభ్యులున్న ఆ కుటుంబం నెలకు సుమారు రూ. 32 వేలతో జీవనం సాగిస్తుండటం పలువురి దృష్టిని ఆకర్షించింది.

సిక్కిం వెళ్లిన తర్వాత, సుమారు 10 ఏళ్లుగా ఉపయోగించకుండా వదిలేసిన తమ పూర్వీకుల ఇంట్లో ఆ కుటుంబం నివాసం ఏర్పాటు చేసుకుంది. పాత ఇంటిని మళ్లీ తమ నివాసంగా మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ స్థిరపడి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా, తన కొత్త జీవన అనుభవాన్ని, నెలవారీ ఖర్చుల లెక్కలను వివరిస్తూ ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. నగర ఉరుకులు పరుగులు వదిలేసి ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో జీవించడం తమకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తోందని ఆమె పంచుకుంది.

ఆమె లెక్కల ప్రకారం, కిరాణా సరుకులు, ఇంటికి అవసరమైన వస్తువులకు నెలకు సుమారు రూ. 15 వేలు ఖర్చవుతోంది. స్కూల్ ఫీజులు, పిల్లల రవాణా ఖర్చుల కోసం రూ. 7 వేలు కేటాయిస్తున్నారు. విద్యుత్ బిల్లు కేవలం రూ. 500 నుంచి రూ. 700 వరకే వస్తోంది. బట్టలు ఉతకడం తదితర చిన్నచిన్న అవసరాలకు రూ. 3 వేలు, పెట్రోల్ మరియు ఇతర ఇంధనాలకు సుమారు రూ. 1,000 ఖర్చవుతోంది. స్నేహితులతో బయటకు వెళ్లడం, వినోదం తదితర వాటికి నెలకు రూ. 5 వేలు ఖర్చు చేస్తున్నట్లు ఆమె తెలిపింది. అంతేకాకుండా, గ్రామంలోని స్థానిక రైతుల నుంచి లభించే తాజా కూరగాయలు తమ ఆహారపు అలవాట్లలో ముఖ్య స్థానం సంపాదించాయని ఆమె పేర్కొంది.

ఈ కుటుంబం ఖర్చులు తక్కువగా ఉండటానికి వారి సొంత (పూర్వీకుల) ఇల్లే ముఖ్య కారణం. ఢిల్లీలో అద్దె ఇంటి కోసం వెచ్చించాల్సిన మొత్తం ఇక్కడ ఆదా అవుతోంది. అలాగే, గ్రామం చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రదేశాలకు చాలాసార్లు నడుచుకుంటూనే వెళ్తుండటంతో బయటకు వెళ్లే ఖర్చు కూడా తగ్గుతోంది. ఆ మహిళ వీడియో చూసిన నెటిజన్లు పలువురు.. సిక్కిం ప్రకృతి సౌందర్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, తాజా కూరగాయలను ఎంతగానో ప్రశంసిస్తున్నారు. నగర జీవితాన్ని వదిలి గ్రామంలో తక్కువ ఖర్చుతో జీవిస్తున్న ఈ కుటుంబం అనుభవం ఇంటర్నెట్‌లో చాలా మందిని ఆలోచింపజేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *