ముంబై: ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 25 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసి కోట్లాది రూపాయలు గుంజిన ఒక అంతర్రాష్ట్ర కేటుగాడిని ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అనుజ్ కుమార్ చంద్రప్రకాష్ త్రివేది అనే ఈ ఘరానా మోసగాడు మ్యాట్రిమోనియల్ సైట్లలో తనను తాను ఒక ఆదర్శవంతమైన వరుడిగా పరిచయం చేసుకుని, పలు రాష్ట్రాల్లోని మహిళలను నమ్మించి పెళ్లాడి కోట్ల రూపాయల వంచనకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ముఖ్యంగా విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలు, మానసికంగా, సామాజికంగా బలహీన స్థితిలో ఉన్న మహిళలే లక్ష్యంగా అనుజ్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. నకిలీ గుర్తింపు కార్డులు, ఎమోషనల్ మానిప్యులేషన్ (భావోద్వేగాలతో ఆడుకోవడం) ద్వారా దేశంలోనే అత్యంత షాకింగ్ మ్యాట్రిమోనియల్ స్కామ్‌లలో ఒకదానికి ఇతను తెరలేపాడు.
గ్రేటర్ నోయిడాలో దొరికిపోయిన నిందితుడు:
మీరా భయందర్-వసాయి విరార్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సందీప్ డోయిఫోడే తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. నకిలీ గుర్తింపుతో జీవిస్తున్న అతడిని మే 24న పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో అతను అజయ్ అగర్వాల్, అజయ్ సంతోష్ సింగ్, జయప్రకాష్ రమేష్ చంద్ గుప్తా వంటి పలు నకిలీ పేర్లను ఉపయోగించినట్లు తేలింది.
ఈ భారీ మ్యాట్రిమోనియల్ స్కామ్ వెలుగుచూసిందిలా..
మార్చి 2022లో ముంబైలోని నయానగర్ పోలీస్ స్టేషన్‌కు ఒక 75 ఏళ్ల వృద్ధురాలు రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ప్రకారం.. ఆ వృద్ధురాలు తన 45 ఏళ్ల కుమార్తె కోసం మ్యాట్రిమోనియల్ సైట్లో ఇచ్చిన ప్రకటనకు నిందితుడు స్పందించాడు. తన పేరు అజయ్ అగర్వాల్ అని పరిచయం చేసుకుని మార్చి 2019లో ఆమె కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్న తర్వాత, మీరా రోడ్లో ఉన్న వారి ఫ్లాట్‌ను అమ్మేయాల్సిందిగా వృద్ధురాలిని ఒప్పించాడు. ఆ డబ్బుతో వేరే ప్రాంతంలో కొత్త ప్రాపర్టీ కొని, రెండంతస్తుల ఇల్లు కట్టిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి ఆ కుటుంబం విడతల వారీగా అతనికి ₹82 లక్షల నగదును అందజేసింది.
ఢిల్లీకి తీసుకెళ్లి.. నగలు, నగదుతో జంప్:
ఆ తర్వాత ఒక బంధువు పెళ్లి ఉందనే నెపంతో బాధితురాలిని నిందితుడు ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక రైల్వే స్టేషన్లో ఆమెను బలవంతంగా ముంబై వెళ్లే రైలు ఎక్కించాడు. ఆమె వద్ద ఉన్న 33 తులాల బంగారు ఆభరణాలను లాక్కొని అక్కడి నుండి పరారయ్యాడు. వెంటనే తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి మాయమయ్యాడు. ఈ మోసం కారణంగా బాధితురాలు, ఆమె కుమార్తె దాదాపు ₹97 లక్షల రూపాయలు నష్టపోయారు.
బలహీనతలే పెట్టుబడిగా మోసాలు:
దర్యాప్తులో పోలీసులకు నిందితుడి భయంకరమైన మోసాల నెట్వర్క్ తెలిసింది. అనుజ్ త్రివేది మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, పేపర్ ప్రకటనల ద్వారా.. విడాకులు తీసుకున్నవారు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు లేదా ఏదైనా సమస్యల్లో ఉండి ఆసరా కోసం చూసే మహిళలను టార్గెట్ చేసేవాడు. వారిపై అమితమైన ప్రేమను చూపిస్తూ, అండగా ఉంటానని నమ్మించి పెళ్లి చేసుకునేవాడు. ఆ తర్వాత వారిని ఆర్థికంగా ముంచి బోర్డు తిప్పేవాడు.
లగ్జరీ కార్లు.. కొడుకు కూడా సహ నిందితుడే:
ఇలా మోసం చేసిన డబ్బుతో అనుజ్ దాదాపు ₹20 లక్షల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. పోలీసులు ప్రస్తుతం ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద నుండి మూడు మొబైల్ ఫోన్లు, ఒక ఏటీఎం కార్డు మరియు జయప్రకాష్ గుప్తా పేరుతో ఉన్న ఒక నకిలీ గుర్తింపు కార్డును (ఫోటో ఐడీ) స్వాధీనం చేసుకున్నారు.
ఈ దర్యాప్తులో పోలీసులకు మరో షాకింగ్ నిజం తెలిసింది. ఈ మోసాల్లో నిందితుడి కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్నాడు. తండ్రి చేసే ప్రతి మోసంలోనూ అతను సహకరించినట్లు తేలడంతో పోలీసులు అతడిని కూడా ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చారు. అమరావతిలో నమోదైన మరో మోసం కేసులో కూడా అనుజ్ త్రివేది మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని, అక్కడ ఒక మహిళను నమ్మించి ₹25 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.
బాధితులు ముందుకు రావాలని పోలీసుల విజ్ఞప్తి:
ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేటుగాడి చేతిలో మోసపోయిన మహిళలు లేదా కుటుంబాలు ఎవరైనా ఉంటే నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. విచారణ ముమ్మరమవడంతో మరికొంత మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని, ఇది ఇటీవలి కాలంలోనే దేశంలోనే అతిపెద్ద మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ కేసుగా మారే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply