పాట్నా/ఢిల్లీ: బీహార్ రాజకీయ దిగ్గజం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో దేశ రాజధానిలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. అయితే, నితీష్ కుమార్ ఢిల్లీ రాకపై విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. “మోదీ గారు నితీష్‌ను ఢిల్లీకి పిలిచి పెద్ద తప్పే చేశారు” అంటూ మహాగటబంధన్ ఎమ్మెల్యే ఐపీ గుప్తా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
“ప్రధానిగా తిరిగి రావాలన్నదే మా కోరిక!”
సహర్సా ఎమ్మెల్యే ఐపీ గుప్తా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారంపై స్పందిస్తూ సెటైర్లు వేశారు. ఆయన మాటల్లోనే.. “బీహార్‌లో ఉంటూనే నరేంద్ర మోదీకి నితీష్ కుమార్ చుక్కలు చూపించారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీలోనే మకాం వేస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు (TDP), రాహుల్ గాంధీ వంటి దిగ్గజాలతో భేటీ అవుతారు. నితీష్ గారు ఢిల్లీ నుండి తిరిగి వస్తే అది ప్రధానిగానే రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే తెలియదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నీళ్లు తాగించడం ఖాయం.”
కూటమిలో ‘కుంపటి’.. ముకేశ్ సహానీపై ఆగ్రహం!
తన పార్టీ (ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన గుప్తా, మహాగటబంధన్ అంతర్గత విబేధాలను కూడా బయటపెట్టారు.
- ముకేశ్ సహానీకి నో ఎంట్రీ: కూటమిలో ఉన్న ముకేశ్ సహానీని తన కార్యక్రమానికి ఎందుకు పిలవలేదన్న ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. “ముకేశ్ సహానీని పిలవాల్సిన అవసరం లేదు. ఆయన వల్ల కూటమికి నష్టమే తప్ప లాభం లేదు” అంటూ ఆఫ్ ది రికార్డ్‌గా మండిపడ్డారు.
- మహా సభకు అతిథులు: ఏప్రిల్ 12న జరగనున్న పార్టీ వేడుకలకు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, దీపాంకర్ భట్టాచార్య వంటి నేతలు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.
