తండ్రికి కూతుళ్లు ఇచ్చిన బహుమతి…

ఏడుగురు ఆడపిల్లలను పెంచి, వారిని స్వయం సమృద్ధి (Self-reliant) కలిగిన కూతుళ్లుగా మార్చారు కమల్ సింగ్. ఆయన ఏడుగురు కూతుళ్లు పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పనిచేయడం విశేషం.

వీరు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుని తల్లిదండ్రులకే కాక, బీహార్ రాష్ట్రాన్ని కూడా గర్వించేలా చేశారు. తండ్రి కలను నిజం చేసిన కూతుళ్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

బీహార్‌లోని ‘చాప్రా’ అనే ఊరిలో ఒక చిన్న పిండి మిల్లు యజమాని కమల్ సింగ్. ఆయనకు తొమ్మిది మంది సంతానం. అందులో ఒక బిడ్డ మరణించింది. మిగిలిన ఎనిమిది మందిలో ఏడుగురు కూతుళ్లు, ఒక కొడుకు. కమల్ సింగ్ మాటల్లోనే:

”ఎనిమిది మంది పిల్లలను పెంచడం నాకు చాలా కష్టంగా ఉండేది. ఏడుగురు కూతుళ్లకు తండ్రినైనందుకు ఊరంతా నన్ను ఎగతాళి చేసేది. ప్రారంభ రోజుల్లో, ‘ఏడుగురు కూతుళ్లకు ఎలా పెళ్లి చేస్తావు? డబ్బు కోసం ఎక్కడికి వెళ్తావు? ఆడపిల్లల వల్ల కుటుంబానికి ఖర్చే కానీ, ఆడపిల్లల వల్ల కుటుంబానికి ఆదాయం లభించదు’ అంటూ బాధతో విచారించేవారు. నాకు మనసు భారంగా అనిపించేది. కానీ నా మనోవేదనను భార్య, కూతుళ్లతో పంచుకునేవాడిని కాదు.

నాకు చేతనైనంత వరకు కూతుళ్లను అమూల్యమైన రత్నాలుగా మార్చాలని నిశ్చయించుకున్నాను. దానిని విద్య ద్వారా మాత్రమే సాధించగలను అని నిర్ణయించుకున్నాను.

నా ప్రణాళిక అమలులో భాగంగా, రోజువారీ దినచర్యలో భాగంగా, తెల్లవారుజామున 4 గంటలకు కూతుళ్లను నిద్రలేపి పరుగెత్తమని చెప్పేవాడిని. కఠినమైన శారీరక శిక్షణ తర్వాత, పాఠ్యపుస్తకాలు చదివేలా చేసేవాడిని. ప్రతి రోజు రాత్రి 11 గంటల వరకు చదివించేవాడిని. దాంతో పాటు పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇప్పించాను. ఒక్కమాటలో చెప్పాలంటే, నా ప్రతి రోజు కూతుళ్లతో మొదలై, వారికోసం పగటిపూట పని ప్రణాళికలతోనే గడిచేది. నెమ్మది నెమ్మదిగా నా ప్రయత్నాలు ఫలించాయి. వరుసగా కూతుళ్లకు పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వచ్చాయి. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేసినవారు, అపహాస్యం చేసినవారు ఇప్పుడు నన్ను, నా భార్యను, కూతుళ్లను మెచ్చుకుంటున్నారు.

పెళ్లయి వారి వారి సొంత జీవితాలు గడుపుతున్నప్పటికీ, కూతుళ్లందరూ కలిసి ఊరిలో ముఖ్యమైన ప్రదేశంలో నా కోసం ఒక పెద్ద ఇల్లు కట్టించి ఇచ్చారు. ‘ఈ ఇల్లు మీరు మాపై ఉంచిన నమ్మకానికి చిహ్నం. ఈ ఇల్లు మా కోసం మీరు పడిన కష్టానికి పెన్షన్ అని భావించండి’ అని అన్నారు. నేను కరిగిపోయాను (భావోద్వేగానికి గురయ్యాను).

ఈ రోజు పరిస్థితి మారిపోయినప్పటికీ, కష్టపడాల్సిన అవసరం లేకపోయినా, నేను నా పిండి మిల్లును కొనసాగిస్తూనే ఉన్నాను. ఏడుగురు కూతుళ్లను కన్నవాడికి ఎవరు అప్పు ఇస్తారు? పిండి మిల్లు నుండి నేను సంపాదించిన డబ్బుతోనే నా కూతుళ్లను చదివించాను. నేను దానిని ఎలా మూసివేసి ఊరుకోగలను?

కూతుళ్లపై నా దృష్టి నా ఏకైక కుమారుడు రాజీవ్ సింగ్ రాజ్‌పుత్ చదువుపై ప్రభావం చూపలేదు. బి. టెక్ వరకు చదివించాను. ఢిల్లీలో స్థిరపడిన రాజీవ్‌కు కూడా నేను ఏ లోటు చేయలేదు. నా కూతుళ్లు ఉద్యోగం కారణంగా చాలా చోట్ల పనిచేస్తున్నప్పటికీ హోలీ పండుగ దగ్గరైనప్పుడు నా ఇంటికి వచ్చేస్తారు. అంతా కలిసి వేడుక చేసుకుంటాం.

ఈ రోజు అన్ని సౌకర్యాలతో జీవిస్తున్నప్పటికీ, మేము ఆహారం కోసం పోరాడిన ఆ నాటి రోజులను మర్చిపోలేము. ఇతరులు మా జీవితంలో శాపాలుగా భావించిన వాటిని నా కూతుళ్లు తొలగించి, మా జీవితాన్ని సంతోషాలతో నింపారు. కూతుళ్లు ఒక వరం” అంటూ భావోద్వేగంతో అన్నారు కమల్ సింగ్.


Posted

in

by

Tags: