తండ్రిని అవమానించిన వ్యక్తిని వదలనంటూ కక్ష! మనసులో పగ పెంచుకుని 35 ఏళ్ల వ్యక్తిపై గురి.. మద్యం తాగించి రాయితో కొట్టి చంపిన దారుణం!

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 20 ఏళ్ల యువకుడు, 35 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

మృతుడిని రాకేష్ రేగర్‌గా గుర్తించారు. దీపావళికి ముందు రాకేష్‌కు, యువకుడి తండ్రి సోహన్‌లాల్‌కు మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో తన తండ్రిని రాకేష్ అవమానించాడని భావించిన యువకుడు, అతడిపై తీవ్ర పగ పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో తన స్నేహితుడైన ఓ బాలుడితో కలిసి రాకేష్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. గత నవంబర్ 17న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌పై వెళ్తున్న రాకేష్‌ను వీరిద్దరూ కలిశారు. మద్యం తాగుదామని చెప్పి అతడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కలిసి మద్యం సేవించగా, రాకేష్ తీవ్ర మత్తులోకి జారుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మద్యం తాగిన తర్వాత బైక్‌పై తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించిన రాకేష్ వాహనాన్ని ఆ యువకుడు కాలితో తన్ని కిందపడేశాడు. అనంతరం సుమారు 3 కిలోల బరువున్న రాయితో అతడి ఛాతీ, ముఖం, దవడ భాగాలపై 15 నుంచి 20 సార్లు బలంగా మోదినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో బాలుడు కూడా సహకరించినట్లు తెలుస్తోంది.

హత్య అనంతరం రాకేష్ మృతదేహాన్ని, బైక్‌ను అక్కడే వదిలేసి, దీనిని రోడ్డు ప్రమాదంగా అందరూ భావించేలా చిత్రీకరించాలని నిందితులు ప్లాన్ చేశారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల్లో అది ప్రమాదం కాదని తేలింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 20 ఏళ్ల అజయ్ కుమార్ రేగర్‌ను అరెస్ట్ చేశారు. అతడితో పాటు ఉన్న బాలుడిని కూడా అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టులో హాజరుపరిచి, బాలుర సంరక్షణ గృహానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *