కాలిఫోర్నియాకు చెందిన జేడ్ జాంగ్స్ అనే యువతి, తన పెంపుడు తండ్రి థామస్ మెర్రిమన్ ల్యాప్‌టాప్‌ను పరిశీలిస్తున్నప్పుడు అందులో తన నగ్న ఛాయాచిత్రాలు (Nude Photos) ఉండటాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి, మానసిక వేదనకు గురైంది.
ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె, 2020 న్యూ ఇయర్ ముందస్తు రాత్రి తన పెంపుడు తండ్రికి మోతాదుకు మించి నిద్రమాత్రలు, పెయిన్ కిల్లర్ మందులు ఇచ్చి అపస్మారక స్థితిలోకి చేర్చింది. ఆ తర్వాత, ఒక ప్లాస్టిక్ కవర్‌ను తలకు చుట్టి ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా చంపేసింది.
ఈ హత్య చేసిన సమయంలో జాంగ్స్ తన పాత స్నేహితుడైన ఆడమ్ సిప్లియాక్కు కొన్ని మెసేజ్‌లు పంపింది. అందులో తన తండ్రికి భారీ మోతాదులో మత్తు మందు ఇచ్చానని, ఒకవేళ అతడు కళ్లు తెరిస్తే తలపై బలంగా కొట్టి చంపేస్తానని పేర్కొంది. అంతేకాకుండా, హత్య చేసిన విషయాన్ని స్నేహితుడి వద్ద అంగీకరిస్తూ, తన కారులో ఉన్న మృతదేహాన్ని దాచడానికి సాయం చేయాలని కోరింది. అయితే అందుకు ఖరాఖండిగా తిరస్కరించిన ఆడమ్, మరుసటి రోజు ఉదయమే పోలీసులకు పూర్తి సమాచారం అందించాడు.
పోలీసుల దర్యాప్తులో థామస్ మెర్రిమన్ మృతదేహం పార్కింగ్ ప్రదేశంలో చెత్తకుప్పల కింద దాచి ఉంచిన స్థితిలో లభ్యమైంది. ఈ కేసు విచారణలో జాంగ్స్ తరపున వాదిస్తూ.. ఆమె తన పెంపుడు తండ్రిని ఎంతో ప్రేమించిందని కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ, పక్కా సాక్ష్యాధారాల ఆధారంగా 2023లో కోర్టు ఆమెను దోషిగా తేల్చి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ఆమె దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన కాలిఫోర్నియా న్యాయస్థానం, 2024 అక్టోబర్‌లో ఆ 25 ఏళ్ల జైలు శిక్షను పునరుద్ఘాటించింది.

Leave a Reply