అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో, స్కూళ్లలో తమ పిల్లలకు తక్కువ మార్కులు లేదా గ్రేడ్లు వస్తే, తల్లిదండ్రులు నేరుగా పాఠశాల యాజమాన్యంపై కేసు వేస్తున్న వింత ధోరణి పెరుగుతోంది.
ఒకప్పుడు పిల్లలకు తక్కువ గ్రేడ్లు వస్తే వారికి బుద్ధిచెప్పి బాగా చదివించే తల్లిదండ్రులు.. ఇప్పుడు ఉపాధ్యాయుల మూల్యాంకనాలను (రిపోర్టులను) వ్యతిరేకిస్తూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు.
కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో ప్రాంతంలో, 3వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి రిపోర్ట్ కార్డులో “ఇతరులతో కలిసి పనిచేసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి” అని టీచర్ రాసినందుకు, ఆ పిల్లాడి తల్లి స్కూల్ యాజమాన్యంపై కేసు వేసింది. ఆటస్థలంలో తోటి విద్యార్థి ఎగతాళి చేసినప్పుడు ఆ బాలుడు తన్నిన ఘటనను ఉద్దేశించే టీచర్ అలా రాశారు. కానీ, దీన్ని అంగీకరించని ఆ తల్లి న్యాయపోరాటానికి దిగింది.
మరో ఘటనలో, 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి రాసిన ఇంగ్లీష్ వ్యాసాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రాశాడంటూ టీచర్ తక్కువ గ్రేడ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి తండ్రి, తన కొడుకు సొంతంగానే ఆ వ్యాసం రాశాడని నిరూపించడానికి ఏకంగా 1,162 పేజీల ఆధారాలను సమర్పించి, స్కూల్‌పై ఫెడరల్ కోర్టులో కేసు వేశాడు.
అంతేకాకుండా, మాతృభాష ఇంగ్లీష్ కాని విద్యార్థుల పట్ల ఏఐ (AI) డిటెక్షన్ సాఫ్ట్వేర్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 2024లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 10 మందిలో నలుగురు ఉపాధ్యాయులు తమ విద్యార్థుల గ్రేడ్లను మార్చాలంటూ తల్లిదండ్రుల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులే ఉపాధ్యాయులపై ఇలాంటి ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలు అమెరికాలోని ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలకు ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారి తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Leave a Reply