బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవ్య శ్రీ (Navya Shree), ఒక మాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఒక వ్యక్తిని కలిసింది. ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పెళ్లి చేసుకోకపోగా ఏకంగా రూ. 1.52 కోట్లు కాజేశాడు.
తను రూ. 715 కోట్ల ఆస్తి ఉన్న పెద్ద బిజినెస్మెన్ అని అతను చెప్పుకున్నాడు. తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నవ్య కుటుంబాన్ని ఒప్పించి, వారి దగ్గర భారీగా అప్పులు తీసుకున్నాడు. నవ్య తన డబ్బు తిరిగి అడగడానికి అతని ఇంటికి వెళ్లినప్పుడు అసలు నిజం బయటపడింది. ఆ వ్యక్తికి ఇదివరకే పెళ్లయిందని, అతని భార్యతో సహా కుటుంబ సభ్యులందరూ ఈ మోసంలో భాగస్వాములని తెలిసింది. నిందితుడు, అతని తండ్రి మరియు భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నమ్మకాన్ని ఎలా గెలుచుకున్నాడు? నవ్య శ్రీకి ‘ఒక్కలిగ మాట్రిమోనీ’ ద్వారా మార్చి 2024లో విజయ్ రాజ్ గౌడ అలియాస్ విజేత్ బి. పరిచయమయ్యాడు. తను VRG ఎంటర్ప్రైజెస్ యజమానినని, బెంగళూరులోని రాజాజీనగర్, సదాశివనగర్ ప్రాంతాల్లో క్రషర్లు, లారీలు మరియు భారీ భూములు ఉన్నాయని నమ్మబలికాడు. తనపై ఉన్న ఒక పాత ఈడీ (ED) కేసు బెయిల్ ఆర్డర్ కాపీని చూపిస్తూ, తనకు రూ. 715 కోట్ల ఆస్తి ఉందని నమ్మించి నవ్యను బుట్టలో వేసుకున్నాడు.
మోసం మొదలైంది ఇలా.. ఏప్రిల్ 4న తన బ్యాంక్ అకౌంట్లో సమస్య ఉందని చెప్పి నవ్య దగ్గర రూ. 15,000 అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత కలిసి బిజినెస్ చేద్దామని నమ్మించి లోన్లు తీసుకునేలా చేశాడు. తన తండ్రి రిటైర్డ్ తహశీల్దార్ అని, సౌమ్య అనే ఆమె తన చెల్లెలు అని పరిచయం చేశాడు. నవ్య స్నేహితుల దగ్గర కూడా సుమారు రూ. 89 లక్షల వరకు పెట్టుబడి పెట్టించాడు. డబ్బు తిరిగి అడగగా కోర్టు ఆర్డర్లు చూపిస్తూ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని అబద్ధాలు చెప్పాడు. నవ్య తల్లిదండ్రుల రిటైర్మెంట్ ఫండ్స్, నగలు కలిపి మొత్తం రూ. 1.53 కోట్లకు పైగా కాజేశాడు.
ట్విస్ట్: చెల్లెలు కాదు భార్య! నవ్య నిందితుడి ఇంటికి వెళ్లినప్పుడు అతనికి మూడేళ్ల క్రితమే పెళ్లయిందని, ఒక బాబు కూడా ఉన్నాడని తెలిసింది. అతడు తన చెల్లెలు అని పరిచయం చేసిన సౌమ్య నిజానికి అతని భార్య. డబ్బు తిరిగి అడిగితే చంపేస్తామని వారు బెదిరించారు. మొత్తం రూ. 1.75 కోట్లలో కేవలం రూ. 22 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి, మిగిలిన రూ. 1.53 కోట్లు ఎగ్గొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
