భాగల్పూర్ నుంచి దానాపూర్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి ప్రయాణికులు తగిన గుణపాఠం చెప్పారు. రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో, కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుడి మొబైల్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన ఒక దొంగ చిక్కిపోయాడు. రైలు వేగం పుంజుకునేలోపే ప్రయాణికులు అప్రమత్తమై అతడి చేతిని లోపలి నుంచి గట్టిగా పట్టుకున్నారు. దీంతో తప్పించుకునే మార్గం లేక ఆ దొంగ రైలు కిటికీకి బయటి వైపు వేలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న రైలు కిటికీ వెలుపల వేలాడుతూ ప్రాణభయంతో ఆ దొంగ అరుస్తున్న దృశ్యాలు చూసేవారిని షాక్‌కు గురిచేశాయి. తనను వదిలేయాలని అతను ఎంత బతిమాలుకున్నప్పటికీ, ప్రయాణికులు అతడిని విడిచిపెట్టకుండా సురక్షితమైన ప్రదేశంలో పోలీసులకు అప్పగించేందుకు గట్టిగా పట్టుకునే ఉంచారు. రతన్‌పూర్ ప్రాంతం దగ్గరకు చేరుకోగానే, తీవ్రంగా శ్రమించి తన చేతిని విడిపించుకుని తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆ దొంగ.. కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రజల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న ఇలాంటి నేరాలను అరికట్టేందుకు రైల్వే శాఖ, పోలీసులు కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కదులుతున్న రైలులో దొంగను ప్రయాణికులు పట్టుకున్న ఈ సాహసోపేత ఘటన, దానికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా షేర్ అవుతూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply