తమిళనాడులో ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శల వర్షం; డీఎంకేను ఉద్దేశించి సెటైర్లు

తమిళనాడులో నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని ‘విశ్వాసఘాతక’ పార్టీగా అభివర్ణించారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ డీఎంకేను మోసం చేసిందని ఆయన అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ.. తమిళనాడులోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

“గత 25 నుండి 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ మరియు డీఎంకే మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయి. డీఎంకేతో పొత్తు కాంగ్రెస్‌ను అనేకసార్లు సంక్షోభం నుండి గట్టెక్కించింది. 2014 కంటే ముందు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండటానికి డీఎంకే ప్రధాన కారణం. కానీ, ఏ డీఎంకే అయితే నిరంతరం కాంగ్రెస్ పురోభివృద్ధి కోసం పనిచేసిందో, రాజకీయ గాలి మళ్లగానే కాంగ్రెస్ ఆ పార్టీకి ద్రోహం చేసింది” అని మోదీ పేర్కొన్నారు.

డీఎంకేను మోసం చేసిన కాంగ్రెస్
అధికార దాహంతో ఉన్న కాంగ్రెస్, అవకాశం చిక్కగానే డీఎంకే వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మరో పార్టీ ఆసరా కోసం చూస్తోందని ఎద్దేవా చేశారు.

అంతర్గత వివాదాలతో సతమతమవుతున్న కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడం మానేసి, ఇక్కడి ప్రభుత్వం తమ అంతర్గత వివాదాలను సర్దుబాటు చేసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తోందని మోదీ అన్నారు. ముఖ్యమంత్రి ఎంత కాలం పదవిలో ఉంటారో కూడా ఇప్పటికీ స్పష్టత లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో స్పందిస్తూ.. “తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సి. జోసెఫ్ విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి నిరంతరం కృషి చేస్తుంది” అని పేర్కొన్నారు.

కేరళలోనూ అదే పరిస్థితి
కేరళలో కూడా కాంగ్రెస్ ఏ నిర్ణయానికి రాలేకపోతోందని ప్రధాని అన్నారు. “సొంత పార్టీ నాయకులకే వాగ్దానాలు చేసి మళ్లీ వారినే మోసం చేస్తున్నారు. గతంలో ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్‌లో కూడా ఇదే జరిగింది. కర్ణాటకలోనూ అదే ఆట సాగుతోంది. ఇప్పుడు కేరళ వంతు వచ్చింది” అని మోదీ హెచ్చరించారు.


Posted

in

by

Tags: