తమిళనాడు రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒక రహస్య సర్వే ఫలితాలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని ఒక ప్రధాన ద్రావిడ పార్టీ, అలాగే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మరో పార్టీ తమ సొంత నిఘా విభాగాల ద్వారా విడివిడిగా జరిపిన సర్వేల్లో.. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) రాబోయే ఎన్నికల్లో మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తేలింది.
కేవలం కొన్ని బహిరంగ సభలతోనే ఒక కొత్త పార్టీ ఇంతటి ప్రభావాన్ని ఎలా చూపగలుగుతోందని రాజకీయ ఉద్దండులు విస్మయానికి గురవుతున్నారు.
మౌన విప్లవం – సర్వే ముఖ్యాంశాలు: ఈ సర్వేలు ప్రధానంగా ‘మౌన విప్లవం’ వైపు మొగ్గు చూపుతున్నాయి. సాధారణ పార్టీ కార్యకర్తలే కాకుండా, ఏ రాజకీయ గుర్తింపు లేని తటస్థ ఓటర్లు, ముఖ్యంగా మహిళలు మరియు తొలిసారి ఓటు వేస్తున్న యువత విజయ్ వైపు ఆకర్షితులవుతున్నారు. గత 50 ఏళ్లుగా ద్రావిడ పార్టీల పాలనపై ప్రజల్లో కలిగిన అసంతృప్తి, విజయ్ను ఒక కొత్త ఆశగా మార్చింది.
కూటమి లెక్కలు తలకిందులు: డబ్బు, అంగబలం మరియు మీడియా బలంతో ఓటర్లను ప్రభావితం చేయవచ్చనే పాత సూత్రాలు విజయ్ విషయంలో పని చేయడం లేదు. ప్రజలు ఒకసారి మార్పు కోరుకుంటే ఎలాంటి బలమైన కూటమి అయినా సరే నిలబడలేదని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం తమిళనాడులో కనిపిస్తున్న ఈ ప్రజా ఉత్సాహం, గతంలో ఎంజీఆర్ లేదా ఎన్టీఆర్ కాలంలో కనిపించిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
విజయ్ అమ్ములపొదిలో కొత్త అస్త్రం: “అధికారంలో భాగస్వామ్యం” అనే విజయ్ కొత్త నినాదం చిన్న పార్టీలను టీవీకే వైపు ఆకర్షిస్తోంది. రహస్య సర్వేల ప్రకారం.. విజయ్ ఒంటరిగానే మెజారిటీ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో విజయ్‌కు ఉన్న ఆదరణ ఇతర పార్టీల నిద్రను చెడగొడుతోంది.
