‘తమ్ముడిలా రండి’.. 4 సీట్లు అడిగిన ఓపీఎస్‌కు షాక్ ఇచ్చిన స్టాలిన్! ‘అమ్మ ఏఐఏడీఎంకే’లో ఐక్యం?

తమిళనాడు రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం (OPS) రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన మద్దతుదారులకు సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఓపీఎస్ కోరగా, దానికి బదులుగా స్టాలిన్ ఆయనకు ఊహించని ప్రతిపాదన చేసినట్లు సమాచారం.

స్టాలిన్ షరతు – ఓపీఎస్ అసంతృప్తి: ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఓపీఎస్ కలిసినప్పుడు, తన మద్దతుదారులకు 4 సీట్లు ఇవ్వాలని కోరారు. అయితే, డిఎంకె (DMK) తరపున పోటీ చేయాలంటే ‘ఉదయ సూర్యుడు’ గుర్తుపైనే పోటీ చేయాలని, వీలైతే డిఎంకెలో చేరాలని స్టాలిన్ సూచించినట్లు తెలుస్తోంది. తన సొంత రాజకీయ ఉనికిని కోల్పోవడం ఇష్టం లేక పన్నీర్‌సెల్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

శశికళ రాజకీయ ఎత్తుగడ: మరోవైపు, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కి బుద్ధి చెప్పడమే లక్ష్యంగా వి.కె. శశికళ పావులు కదుపుతున్నారు. గతంలో పన్నీర్‌సెల్వం వల్లనే శశికళ పార్టీ నుండి దూరం కావాల్సి వచ్చినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి పని చేయాలని ఆమె భావిస్తున్నారు.

‘అమ్మ ఏఐఏడీఎంకే’ ఆవిర్భావం? వచ్చే రెండు రోజుల్లో ‘అమ్మ ఏఐఏడీఎంకే’ (Amma ADMK) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించేందుకు శశికళ సిద్ధమవుతున్నారు. పళనిస్వామికి పట్టున్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టి ఆయనకు చెక్ పెట్టాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓపీఎస్ మద్దతును కూడగట్టడంతో పాటు, నటుడు విజయ్ ప్రారంభించిన ‘టీవీకే’ (TVK) పార్టీ సహాయాన్ని కూడా కోరే అవకాశం ఉందని సమాచారం.


Posted

in

by

Tags: