మహారాష్ట్రలోని ఖండాలా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పని వేళల్లో ప్రధానోపాధ్యాయురాలు తరగతి గదిలో నిద్రపోవడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా పాఠశాలకు తాళం వేసి నిరసనకు దిగారు. అంతేకాకుండా, సదరు ప్రధానోపాధ్యాయురాలిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని, ఆమెను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ మండల విద్యాధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ సుధీర్ వాసుదేవ్ ధోగే కుమారుడు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి, “తరగతి గదిలో మేడమ్ నిద్రపోతున్నారు” అని చెప్పాడు. దీంతో షాక్‌కు గురైన సుధీర్ వెంటనే పాఠశాలకు వెళ్లి చూడగా, సదరు ఉపాధ్యాయురాలు నిజంగానే నిద్రపోతున్నట్లు తేలింది. అంతటితో ఆగకుండా, ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడు కాని ఆమె భర్త, ప్రధానోపాధ్యాయురాలి కుర్చీలో కూర్చుని, పూర్తిగా మద్యం మత్తులో అక్కడికి వచ్చిన తల్లిదండ్రులను బూతులు తిడుతూ, బెదిరింపులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, ఈ ఉపాధ్యాయురాలు ఈ పాఠశాలకు వచ్చినప్పటి నుండి 1 నుండి 4వ తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలు చాలా ఘోరంగా పడిపోయాయి. దీంతో విసుగు చెందిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాల నుంచి మార్పించి, ఇతర పాఠశాలల్లో చేర్పించారు. ఉపాధ్యాయురాలు సరైన సమయానికి పాఠశాలకు రావడం లేదని, దీనిపై ప్రశ్నించిన తల్లిదండ్రులను ఆమె బెదిరిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన ప్రభుత్వ విధులను కూడా ఆమె సరిగ్గా నిర్వహించకుండా నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బ్లాక్ ఎడ్యుకేషన్ సెంటర్ ఇన్-ఛార్జ్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అయితే, ఈలోపే ఆ ఉపాధ్యాయురాలు తన భర్తతో కలిసి అక్కడి నుంచి పరారైంది. దీనిపై మండల విద్యాధికారి మంగేష్ దేశ్‌పాండే వివరణ ఇస్తూ.. “ప్రధానోపాధ్యాయురాలిపై ఫిర్యాదు అందింది. సోమవారం ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సంబంధించిన సిఫార్సులను ఉన్నతాధికారులకు పంపుతాం. ముందు జాగ్రత్త చర్యగా ఆమెను తాత్కాలికంగా బదిలీ చేయడం జరిగింది” అని తెలిపారు. ఈ ఆకస్మిక నిరసనలో గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.
